హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : తెలుగు రాష్ట్రాల్లో వరద కష్టాలపై మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు విచారం వ్యక్తంచేశారు. తన వ్యక్తిగత పెన్షన్ నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు రూ.5 లక్షల చొప్పున సాయం అందించినట్టు సోమవారం ఆయన ప్రకటించారు. ప్రధాని మోదీకి ఫోన్‌చేసి తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితిని వివరిం చగా, రెండు రాష్ట్రాలకు సహాయ సహకారాలు అందజేస్తామని ప్రధాని హామీ ఇచ్చినట్టు చెప్పారు. తన కుమారుడు ముప్పవరపు హర్షవర్ధన్ నిర్వహిస్తున్న ముప్పవరపు ఫౌండేషన్ తరఫున ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.2.5 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ 2.5 లక్షలు అందజేసినట్టు వెల్లడించారు. తన కుమార్తె దీపావెంకట్ ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న స్వర్ణ భారత్ ట్రస్ట్ నుంచి ఏపీ సీఎం సహాయ నిధికి రూ. 2.5 లక్షలు, తెలంగాణ సీఎం సహాయ నిధికి రూ.2.5 లక్షలు అందజేసినట్టు వెంకయ్యనాయుడు తెలిపారు.
వరద సహాయ చర్యల్లో పాల్గొందాం: జేఏసీ
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): వర్షాలు, వరదల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులం తా సహాయ, పునరావాస కార్యక్రమా ల్లో పాల్గొనాలని తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ పిలుపునిచ్చింది. జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావులు మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.పనిగంటలతో సంబంధం లేకుండా నిబద్ధతతో పనిచేయాలని, ప్రజలకు భరోసానివ్వాలని కోరారు.
విజయవాడ హైవేపై రాకపోకల పునరుద్ధరణ
బొడ్రాయిబజార్, సెప్టెంబర్ 2 : హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి 65పై నందిగామ వద్ద వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగుతాయని సూర్యాపేట ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ సోమవారం తెలిపారు. గరికపాడు వద్ద పాత బ్రిడ్జి ధ్వంసమైనందున వాహనాలను కొత్త బ్రిడ్జిపై నుంచి మాత్రమే పంపిస్తున్నారని పేర్కొన్నా రు. వాహనదారులు, ప్రయాణికులు గమనించి బ్రిడ్జిపై నెమ్మదిగా వెళ్లాలని సూచించారు.