రవీంద్రభారతి, డిసెంబర్ 15 : తెలుగు సినిమా సంగీతానికి ఘంటసాల, బాలసుబ్రహ్మణ్య ద్వయం స్వర్ణయుగం తెచ్చారని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు కొనియాడారు. వారు తెలుగు పాటను సుసంపన్నం చేసి తెలుగు వారి హృదయాల్లో సింహాసనం వేసి, పాటకు పట్టాభిషేకం చేశారని పేర్కొన్నారు. కళాత్మక ఆత్మకు, అభిమానుల ప్రేమకు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం నిత్య చిహ్నమని అభివర్ణించారు. సోమవారం తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ, ది మ్యూజిక్ గ్రూప్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతి ప్రాంగణంలో గానగంధర్వుడు, పద్మవిభూషణ్ దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం కన్నులపండువగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెంకయ్యనాయుడు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్‌బాబు హాజరై బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. భాషను, తెలుగువారిని గౌరవించుకోవాలని, టీజీ, ఏపీ, ఎస్పీ అని కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బాలసుబ్రహ్మణ్యం అని పూర్తిగా పిలవడం అలవర్చుకోవాలని సూచించారు.
పరిపూర్ణ వ్యక్తిత్వం కలగలిసిన ప్రతిభామూర్తి, సంస్కారవంతుడు, స్నేహశీలి, నిత్యకృషీవలుడు బాలసుబ్రహ్మణ్యం అని కొనియాడారు. రవీంద్రభారతిలో బాలసుబ్రహ్మణ్యం స్థాపించిన ఘంటసాల విగ్రహం పక్కనే ఆయన విగ్రహం పెట్టడం సముచితంగా ఉన్నదని చెప్పారు. బాలసుబ్రహ్మణ్యం పాట, ప్రేమ ఎవ్వరినీ వదలదని, ఆయన సంస్కారం, ఆదర్శం, స్వర సార్వభౌమత్వానికి నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు. తెలుగుపాట, తెలుగుభాష, సంస్కృతీ సంప్రదాయాలను ఎంతో గౌరవించి యువతకు స్ఫూర్తినిచ్చి ‘పాడుతా తీయగా..’ కార్యక్రమం ద్వారా ఎందరో యువ గాయకులను తీర్చిదిద్దిన బాలసుబ్రహ్మణ్యం వ్యక్తిత్వం మహోన్నతం అని పేర్కొన్నారు. బాలు సుస్వరాల అక్షయపాత్ర అని కొనియాడారు. సినీ సంగీత శిఖరాగ్రంలో ఉన్నా, మట్టి పరిమళాన్ని మరచిపోలేని ఆయన వ్యక్తిత్వం తనకెంతో ఇష్టమని చెప్పారు. బాలు పాటతోనే తన దైనందిన చర్య ప్రారంభమవుతుందని తెలిపారు. తనది నెల్లూరు జిల్లా అయినా హైదరాబాద్‌లో నివస్తున్నానని కాబట్టి, తాను తెలంగాణవాడినేనని వెంకయ్యనాయుడు చెప్పుకున్నారు. బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. తెలుగు సినిమా పాటల గౌరవం బాలు అని అభివర్ణించారు. బాలు పాటలాగే ఆయన మనస్సు కూడా ప్రేమమయం అని కితాబునిచ్చారు. బాలు అజాతశత్రువు అని, ప్రేమ, ఆత్మీయతలతో కూడిన బాలు హృదయం తరతరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
కళాకారులకు ముఖ్యంగా సంగీతానికి భాష, ప్రాంత బేధాలు లేనేలేవని, వ్యక్తిత్వ వికాసానికి సంగీతం ఎంతో దోహదపడుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. సినీసంగీత ప్రపంచంలో రారాజు, పాటల సామ్రాజ్యంలో నెలరాజు బాలుకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన గౌరవం.. రవీంద్రభారతిలో విగ్రహం ఏర్పాటు అని వివరించారు. కుల, మత, ప్రాంతం చూడకుండా తెలుగుఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పి, వందలాది మంది గాయకులను తీర్చిదిద్దిన బాలు విగ్రహాన్ని కళల కేంద్రం రవీంద్రభారతిలో ఆయన నెలకొల్పిన ఘంటసాల విగ్రహం పక్కనే ఏర్పాటుచేయాలన్నది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని స్పష్టంచేశారు. ఇది తెలుగు పాటకు ఇచ్చిన గౌరవం అని చెప్పారు. సినీ సంగీత చరిత్రలో చెదరని సంతకం బాలసుబ్రహ్మణ్యం అని పేర్కొన్నారు. ఆయన హైదరాబాద్‌లోనే 38 వేల పాటలు పాడి రికార్డు సృష్టించారని గుర్తుచేశారు. కార్యక్రమంలో బాలసుబ్రహ్మణ్యం సతీమణి సావిత్రి, కుమారుడు చరణ్, కుమార్తె పల్లవి, సోదరి శైలజ, నటుడు శుభలేఖ సుధాకర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు, బయోటెక్స్ చైర్మన్ పద్మవిభూషణ్ వరప్రసాద్‌రెడ్డి, వివిధ రంగాల ప్రముఖులు సీహెచ్ కిరణ్, విజయబాపినీడు, అచ్యుత రామరాజు, ఎస్ కృష్ణమూర్తి, వేదుల సుదర్శన్, సురేఖమూర్తి, రామాచారి తదితరులు పాల్గొన్నారు. అనంతరం పలువురు గాయకులు బాలు పాటలతో అలరించారు.
కవాడిగూడ, డిసెంబర్ 15: హైదరాబాద్ రవీంద్రభారతి ప్రాంగణంలో సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటుచేయడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద సోమవారం నిరసన వ్యక్తంచేశారు. బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఏర్పాటుచేయడం సరికాదని తెలంగాణ ఉద్యమకారులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్యమకారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
జేఏసీ అధ్యక్షుడు ప్రఫుల్రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి చంద్రన్న, ఎంబీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్, మోహన్, ప్రభాకర్, లావణ్య, బాలలక్ష్మి, సూర్యకళ, యాదగిరి, మాధవీలతను పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రఫుల్రాంరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ పాట పాడేందుకు నిరాకరించిన బాలసుబ్రహ్మణ్యం అని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన గాయకుల విగ్రహాలను ఇక్కడ ఏర్పాటుచేయడం తగదని మండిపడ్డారు. ప్రభుత్వం నిర్ణయంపై ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉద్యమకారులు లలిత, కృష్ణాగౌడ్, రాణి తదితరులు పాల్గొన్నారు.