వేములవాడ/ వేములవాడ టౌన్ నవంబర్ 12: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. మంగళవారం అర్ధరాత్రి పోలీసు బందోబస్తు మధ్య ఆలయ ప్రధాన ద్వారం మూసివేసి, పరిసర ప్రాంతాల్లో కంచెలు ఏర్పాటు చేశారు. ఆలయంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, కోడె మొక్కులు, ఆర్జిత సేవలు భీమేశ్వరాలయానికి తరలించామంటూ అధికారులు స్పష్టంచేశారు. ఈ మేరకు ఆలయ పరిసరాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారంలో జనవరిలో జరిగే జాతరకు వెళ్లే భక్తులకు అధికారులు స్పష్టత ఇవ్వలేదు. రాజన్న దర్శనం తర్వాతనే మేడారం జాతరకు వెళ్లే ఆనవాయితీ ఉన్నందున సుమారు కోటి మంది భక్తులు రాజన్నను దర్శించుకుంటారు. ఇలాంటి సమయంలో ముందస్తు ప్రకటన చేయకుండా, ఆలయం మూసివేతపై భక్తులు మండిపడుతున్నారు.

రాజన్నకు మొకులు చెల్లించుకోవాలనుకునే భక్తులు ఇక ప్రధాన ఆలయం ముందున్న రావిచెట్టు వద్ద ఏర్పాటు చేసిన ప్రచార రథంలోని శ్రీరాజరాజేశ్వర స్వామి, శ్రీరాజరాజేశ్వరి దేవి, లక్ష్మీ గణపతి అమ్మవార్ల ప్రతిమల వద్ద మొకులు చెల్లించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. అకడికి చేరుకోవడానికి రాజన్న ఆలయ గుడి చెరువు నుంచి, జగిత్యాల బస్టాండ్ నుంచి కూడా వచ్చేందుకు భారీ క్యూ లైన్లను నిర్మించారు. అర్చకులకు విధులు కేటాయించడంతోపాటు అకడికి చేరుకునే భక్తులకు బొట్టు తీర్థం ప్రసాదం అందిస్తున్నారు. ఇక ఎల్ఈడీ స్రీన్ ద్వారానే రాజన్న గర్భాలయం వద్ద జరుగుతున్న పూజలు, స్వామి వారి చిత్రాలను ప్రదర్శిస్తూ దర్శనాలు కల్పించారు. క్యూలైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకోవడం, అకడికి చేరుకునే మార్గాలపై అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో భక్తులు గందరగోళానికి గురవుతున్నారు.
రాత్రికి రాత్రి ఆలయం మూసివేయడంపై రాజన్న భక్తులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. స్వామి వారి మొకులు చెల్లించుకునేందుకు వచ్చిన వారు బుధవారం పడమటి ద్వారం, ప్రధాన రహదారి వద్ద కొబ్బరికాయలు కొట్టి, మొకులు చెల్లించుకున్నారు. తలనీలాలు సమర్పించుకున్న భక్తులు కూడా తిప్పలు పడ్డారు. తలనీలాలను రావి చెట్టు వద్ద వేద్దామని భావించిన భక్తులు, అకడికి వెళ్లేందుకు అనుమతి లేకపోవంతో ఆలయ గేట్ల వద్దనే మొక్కులు తీర్చుకున్నారు. ప్రధానాలయానికి వచ్చే అర్చకులు, ఇతర సిబ్బందికి ప్రత్యేక గుర్తింపు కార్డులను జారీ చేయనున్నట్టు తెలిసింది. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆలయాన్ని మూసివేయడమేంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. సరైన ప్రణాళిక పాటిస్తే… అందుకు తగిన విధంగా దర్శానాలను ప్లాన్ చేసుకుని, మొక్కులు చెల్లించుకునేవాళ్లమని చెప్తున్నారు.

రాజన్న ఆలయ ప్రధాన మెట్ల గేటు వద్ద, పడమటి ద్వారం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అంబేదర్ విగ్రహం నుంచి ఆలయం వైపు పోలీసులు బారీకేడ్లను ఏర్పాటు చేసి, ఆంక్షలు విధించారు. జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య, పట్టణ ఇన్చార్జి సీఐ శ్రీనివాస్, చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్బీ సీఐ రవికుమార్ బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు దర్శనాలు నిలిపివేసిన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బుధవారం ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఆలయం ముందు ఏర్పాటు చేసిన ప్రచార రథంలోని ప్రతిమలను దర్శించుకుని పూజలు చేశారు.
జగిత్యాల జిల్లా ఎకీన్పూర్ గ్రామానికి చెందిన చాడ మానస, రమేశ్ దంపతులు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె. పిల్లల అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో రమేశ్.. కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయాడు. మానస తన తల్లి సహకారంతో జీవిస్తున్నది. వేములవాడలోని బట్టల దుకాణంలో మానస రూ.5వేల వేతనానికి గుమస్తాగా పనిచేసేది. ఐదు నెలలుగా రాజన్న ఆలయాన్ని మూసివేస్తామని ఓసారి, తెరిచే ఉంటుందని మరోసారి అధికారులు పొంతన లేని ప్రకటనలు చేయడంతో భక్తుల రాక తగ్గిపోయింది. దీంతో చిరువ్యాపారాలు డీలాపడ్డాయి. మానస పనిచేసే బట్టల షాపులో పని కోల్పోయింది. ఇంటి వద్దనే బీడీలు చుడుతున్నది. చాలీచాలని కూలీతో అద్దె చెల్లించకపోవడంతో యజమాని ఇల్లు ఖాళీ చేయించాడు. దిక్కుతోచని పరిస్థితిలో తల్లి, ఇద్దరు పిల్లలను వెంటబెట్టుకొని మంగళవారం రాత్రి ఇల్లు ఖాళీ చేసి, వేములవాడ ఎంపీడీవో వరండాలో తలదాచుకుంటున్నది. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నది.