హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావును శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర వ్యవసాయరంగ వ్యవహారాల ప్రధాన సలహాదారు, శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్‌బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. వేములవాడ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్‌తో ఆయన చర్చించారు.
వేములవాడ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, పెండింగ్ పనుల అనుమతులు, దేవాలయ అభివృద్ధి, కలికోట సూరమ్మ చెరువు, మిగిలి ఉన్న ముంపు గ్రామాల సమస్యలు, ప్రధాన రోడ్లు, బ్రిడ్జిల అనుమతులు, కోనారావుపేట, కథలాపూర్, మన్నేగూడెం మండలాల ఏర్పాటుపై చర్చించారు. సలహాదారుగా నియమితులైన చెన్నమనేని రమేశ్‌కు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. తనపై నమ్మకంతో బాధ్యత అప్పగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తోపాటు మంత్రి కేటీఆర్‌కు చెన్నమనేని కృతజ్ఞతలు తెలియజేశారు.