వేములవాడ, జూలై 18 : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రధాన రహదారి కూల్చివేతలు రెండోసారి శుక్రవారం చేపట్టారు. మూలవాగు వంతెన నుంచి రాజన్న ఆలయం వరకు 80 అడుగుల మేర రహదారి విస్తరణలో భాగంగా 243 మంది నిర్వాసితులు ఉన్నట్టుగా గుర్తించిన విషయం తెలిసిందే. జూన్ 16 నుంచి కూల్చివేతలు ప్రారంభించిన అధికారులు.. 84 భవనాల యజమానులు హైకోర్టును ఆశ్రయించి స్టే పొందగా వాటిని ముట్టుకోలేదు.
అభ్యంతరాలు, పరిహారంపై హైకోర్టును ఆశ్రయించిన నిర్వాసితుల స్టే 17వ తేదీ ముగియడంతో అధికారులు మళ్లీ కూల్చివేతలు ప్రారంభించారు. ఇందులో మరో ఆరుగురికి ఈ నెల 23 వరకు స్టే ఉండగా మిగిలిన 78 భవనాలను వేకువజామునే పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేశారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఇన్చార్జి ఆర్డీవో రాధాబాయి, మున్సిపల్ కమిషనర్ అన్వేశ్ కూల్చివేతలను పరిశీలించారు.