మోర్తాడ్, జూలై 5 : కేసీఆర్‌పై కోపంతో రైతుల కడుపు కొట్టొద్ద్దని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌లో వేముల మీడియాతో మాట్లాడారు. లక్ష క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రం పాలవుతున్న వాస్తవాన్ని తెలంగాణ సమాజానికి చూపించడానికి వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు పార్టీ నాయకులను పోలీసులతో అడ్డుకోవడం ప్రభుత్వ పిరికిపంద చర్య అని దుయ్యబట్టారు. కాళేశ్వరంతో ప్రాజెక్ట్ రూ.లక్ష కోట్లు కొట్టుకుపోయాయని కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రూ.94వేల కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌లో రూ.4వేల కోట్ల విలువైన మేడిగడ్డ బరా జ్లో రెండు పిల్లర్లు మాత్ర మే కుంగాయని వెల్లడించా రు.
డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ కింద ఎల్అండ్టీ సంస్థ రూ.400 కోట్లతో మరమ్మతులు చేయడానికి ముందుకొచ్చినా కాంగ్రెస్ ప్ర భుత్వం అనుమతించకపోవడం కక్షసాధిం పు చర్యలకు నిదర్శనమని ధ్వజమెత్తారు. మేడిగడ్డ తో సంబంధం లేకుండానే నీటిని ఎత్తిపోసే వ్యవస్థను కేసీఆర్ సిద్ధం చేసి ఉంచారని చెప్పారు. మేడిగడ్డ బరా జ్‌కు 4కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లి పంప్‌హౌస్ మోటర్లను ఆన్‌చేసి, పంప్‌హౌస్ బటన్ నొక్కితే కాళేశ్వరం నీరు అన్నారం, సుందిళ్ల మీదుగా ఎల్లంపల్లికి చేరుతుందని తెలిపారు. ఎల్లంపల్లి ద్వారా వరదకాలువలోకి నీళ్లుపోసి రివర్స్‌పంపింగ్ ద్వారా ఎస్సారెస్పీని నింపాలని సూచించారు. ఎస్పారెస్పీ నుంచి కాకతీయ, సరస్వతీ కాలువల ద్వారా నిజామాబాద్, కరీంనగర్, నల్లగొండ, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలకు సాగునీటిని అందించవచ్చని చెప్పారు.