వేల్పూర్, ఫిబ్రవరి 15: రాష్ట్రం సాధించి పెట్టిన కేసీఆర్‌ను తెలంగాణ నుంచి బహిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడడంపై మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తంచేశారు. శనివారం ఆయన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డికి మానసిక వ్యాధి సోకిందని, ముఖ్యమంత్రిగా ప్రజలెవరూ ఆయనను గుర్తించడం లేదని చెప్పారు. రేవంత్‌రెడ్డి ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాల్సింది పోయి ప్రతిపక్ష నాయకులపై విమర్శలు చేస్తూ కాలం వెల్లదీస్తున్నారని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్ వ్యవహార శైలి ముఖ్యమంత్రి అయినామారలేదని ఎద్దేవాచేశారు. వంద రోజుల్లో 420 హామీలు అమలు చేస్తానని ప్రజలను నమ్మించి సీఎం గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి ముందు వాటిని నెరవేర్చాలని డిమాండ్‌చేశారు.
కేసీఆర్‌ను బహిష్కరించడం కలలో మాట కాగా, తెలంగాణ ప్రజలు మాత్రం రేవంత్‌రెడ్డిని శాశ్వతంగా బహిష్కరించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని తెలిపారు. మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం చేసినా.. కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయిందని చెప్పారు. రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా నోరు అదుపులో ఉంచుకోవాలని సూచించారు. రాష్ట్రంలో చేపట్టిన కులగణన సర్వే బోగస్ అని ఆరోపించారు. కాంగ్రెస్‌పై నమ్మకంలేక ప్రజలు సర్వేలో పాల్గొనలేదని, పాల్గొన్న వారూ సరైన వివరాలు ఇవ్వలేదని తెలిపారు. తప్పుడు తడకల సర్వే అని బీసీ సంఘాలు ఆరోపిస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సైతం బీసీ గణనను తప్పు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఆ సర్వే లెక్కను కాల్చిపడేయాలని తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో సర్వే ఎలా ఉందో అర్థం అవుతుందన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌పై అడ్డమైన కూతలు ఆపేయాలని హెచ్చరించారు.