హైదరాబాద్ జూన్ 6 (నమస్తేతెలంగాణ): ‘ముఖ్యమంత్రిగా రేవంత్ అధికా రం చేపట్టి 18 నెలలైనా మాజీ సీఎం కేసీఆర్‌పై ఇంకా ఏడుపెందుకు? 70 ఏండ్ల వయసులో ఉన్న పెద్దమనిషి కాలుజారి గాయపడితే తూలనాడటం.. దేవుడు శి క్షించాడని అనడం ఏం సంస్కారం?’ అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. హా మీల అమలు చేతగాక, చెప్పుకునేందుకు ఏమీలేకే ఆలేరు సభలో దుర్భాషలాడారని శుక్రవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. రేవంత్ సీఎం కుర్చీలో ఆయన కూర్చున్నా.. బజారు భాష పోవడం లేద ని దుయ్యబట్టారు.
కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయ్యేందుకు భయపడ్డాడని అసందర్భ ప్రేలాపనలు పేలడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. కేసీఆర్ విచారణకు హాజరయ్యేందుకు మరో తేదీని అడిగారు తప్పితే రాలేనని చెప్పలేదనే విషయాన్ని గుర్తుచేశారు. ఈ రోజు యాదగిరిగుట్ట సాక్షిగా ఆలేరు సభ లో పాపాలు, శిక్ష అంటూ రేవంత్ నిస్సిగ్గుగా తప్పుడు మాటలు మాట్లాడారని తూర్పారబట్టారు.
‘పార్లమెంట్ ఎన్నికలప్పుడు రైతు రుణమాఫీ చేస్తానని అదే యాదగిరిగుట్టపై ఒట్టేసి మాట తప్పితివి.. మరీ నీకు దేవుడు ఏం శిక్ష వేయాలి’ అని ప్రశ్నించారు. అధికారం మత్తులో వీర్రవీగుతున్న రేవంత్ పాపాలు పండే రోజు లు దగ్గరలోనే ఉన్నాయని, ఇప్పటికైనా గల్లీ లీడర్లా కాకుండా హుందాగా నడుచుకోవాలని ప్రశాంత్ హితవు పలికారు.