హైదరాబాద్, ఫిబ్రవరి1 (నమస్తే తెలంగాణ): అన్నదాతకు రైతుభరోసా, రుణమాఫీ, ఆడబిడ్డలకు తులం బంగారం, ప్రతినెల రూ. 2500, విద్యార్థినులకు స్కూటీలు, రైతు కూలీలకు ఆత్మీయ భరోసా ఇలా ఆరు గ్యారెంటీలు, 420 హామీలకు ఎగనామం పెట్టిన ముఖ్యమంత్రిని ప్రజలు ఎనుముల రేవంత్ అనికాకుండా ఎగవేతల రేవంత్‌రెడ్డి అని పిలుస్తున్నారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఎద్దేవాచేశారు. ప్రతిపక్షాలను బూతులు తిడుతూ పచ్చి అబద్ధాలతో పాలన సాగిస్తూ ప్రజలను వంచిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ట్విట్టర్ (ఎక్స్) హ్యాండిల్లో పెట్టిన సర్వేలో కేసీఆర్ ఎక్కువ ఓట్లు రావడంతో ఫ్రస్టేషన్లో రేవంత్‌రెడ్డి బూతులు తిడుతూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని ధ్వజమెత్తారు.
మడమ తిప్పనని, మాట తప్పనని చెప్పి గద్దెనెక్కిన రేవంత్ దేవుళ్లపై ఒట్టేసి చెప్పిన రుణమాఫీకే అతీగతీ లేకుండా పోయిందని మండిపడ్డారు. శనివారం తెలంగాణ భవన్లో కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు పల్లె రవికుమార్ గౌడ్, గాంధీనాయక్, బీసీ కమిషన్ మాజీ సభ్యులు కిశోర్‌గౌడ్, తుంగ బాలుతో కలిసి వేముల విలేకరులతో మాట్లాడారు. ఆగస్టు 15లోగా రైతు రుణాలు మాఫీ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి నాలుగు నెలలు, నాలుగు విడుతల్లో కనీసం సగం మందికి కూడా మాఫీ చేయలేదని విమర్శించారు. ‘కేసీఆర్ రెండు విడతల్లో రూ. 29 వేల కోట్లే మాఫీ చేశారని చెప్పిన రేవంత్‌రెడ్డి..ఆయన సర్కారు కంటే దాదాపు రూ.8 వేల కోట్లు ఎక్కువే మాఫీ చేసిన విషయాన్ని ఒప్పుకొన్నారని చెప్పారు.
ఎకరాకు 15 వేల రైతుభరోసా ఇస్తానని చెప్పి 12 వేలతోనే చేతులు దులుపుకొన్నదెవరు? రెండు పంటలకు రైతుబంధు ఎగ్గొట్టిందెవరు? యాసంగికి జనవరి 26 రాత్రిలోగా టటీటకీమని 6 వేల చొప్పున ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి మాట తప్పిందెవరు? ఇప్పుడు మాట మార్చి మార్చి 31 అంటున్నదెవరు? అవ్వాతాతలకు 4 వేల పింఛన్ ఇస్తానని మోసం చేసిందెవరు? ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలని మాయమాటలు చెప్పిందెవరు?
– వేముల ప్రశాంత్‌రెడ్డి
కేసీఆర్ హయాంలో 11 సార్లు నాట్లప్పుడు రైతుబంధు ఇస్తే రేవంత్‌రెడ్డి ఓట్లప్పుడే ఇస్తున్నారని వేముల విరుచుకుపడ్డారు. ‘ప్రజాదర్బార్‌లో ప్రతిరోజూ ప్రజలను కలుస్తానని చెప్పిన రేవంత్ 14 నెలల్లో కనీసం ఒక్క గంటైనా వెచ్చించారా?.. కేసీఆర్ నిర్మించిన సువిశాలమైన అంబేద్కర్ సచివాలయానికి వెళ్లకుండా జూబ్లీహిల్స్‌లోని తన ఇంటినుంచే పాలనసాగిస్తూ మంత్రులు, అధికారులను తన ఇంటి చుట్టూ తిప్పుకుంటూ రేవంత్‌రెడ్డి అహంకారాన్ని ప్రదర్శిస్తున్నరు’ అని విమర్శించారు.
గతంలో కేసీఆర్ కొట్టిన దెబ్బకు కొడంగల్‌లో ఓడిపోయి మల్కాజిగిరిలో పడ్డ రేవంత్‌రెడ్డికి భవిష్యత్తులోనూ ఇదే దుస్థితి వస్తుందని జోస్యం చెప్పారు. ఇప్పటికైనా సెల్ఫ్ డబ్బాను కట్టిపెట్టి.. చిల్లర మాటలు బంద్‌పెట్టి పాలనపై దృష్టిపెట్టాలని హితవు పలికారు. ‘బీజేపీ, కాంగ్రెస్ నుంచి చెరో ఎనిమిది మంది ఎంపీలను గెలిపిస్తే వారు సాధించింది సున్నా.. రాష్ర్టానికి ఒరిగింది గుండుసున్నా’ అని ఎద్దేవా చేశారు. ప్రజలు ఇప్పటికైనా ఆలోచించాలని, ప్రాంతీయ పార్టీలతోనే న్యాయం జరుగుతుందనే విషయాన్ని గుర్తెరగాలని కోరారు.
ట్విట్టర్‌కు టిక్‌టాక్‌కు తేడా తెలియని వ్యక్తి మన సీఎంగా ఉండడం దురదృష్టకరం. కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్లో చేసిన సర్వేలో కేసీఆర్‌కు 70శాతం, రేవంత్‌కు 30 శాతం ఓట్లు రావడంతో మైండ్‌బ్లాంక్ అయి కేసీఆర్‌పై దూషణలు చేస్తూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నడు. అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ అనే మానసిక వ్యాధితో బాధపడుతున్న రేవంత్‌రెడ్డి, వెంటనే మానసిక వైద్యుడిని సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. లేదంటే రోగం ముదిరి అసలుకే మోసం వస్తది.
– వేముల ప్రశాంత్‌రెడ్డి