ఖలీల్‌వాడి, ఫిబ్రవరి 21: పసుపు రైతులను కాంగ్రెస్, బీజేపీ దారుణంగా వంచించాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. 12 వేల మద్దతు ధర ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసగిస్తే, కనీస మద్దతు ధర ప్రకటించకుండా నామమాత్రపు పసుపుబోర్డు ఇచ్చి బీజేపీ మోసగించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, మార్కెట్ కమిటీ పాలకవర్గం, అధికారులు, దళారులు కుమ్మక్కై పసుపు రైతులను నిండా ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో వేముల శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. కుటుంబం మొత్తం తొమ్మిది నెలలు కష్టపడితే వచ్చే పసుపు ఒకప్పుడు రైతును ఆదుకునేదని, అందుకే రైతులు పసుపును తల్లి పంటగా భావిస్తారని చెప్పారు. ఎన్నికల ముందర రైతులపై హామీలు గుప్పించిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు వంచించాయని, అందరూ కుమ్మక్కవడంతో రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదన్నారు.
ఫలితంగా నిజామాబాద్ గంజ్‌లో రెండు, మూడ్రోజులు నిలబడి తుట్టికి పావుసేరుకు అమ్ముకుంటున్నారని తెలిపారు. సీజన్ ప్రారంభంలో క్వింటాల్‌కు రూ.13 వేలు పలికిన ధర ఇప్పుడు రూ.10 వేలకు పడిపోయిందన్నారు. దళారులు రూ.8 వేలకు మాత్రమే కొని అన్నదాతలను ముంచుతున్నారని మండిపడ్డారు. పాలకవర్గం దళారులతో కుమ్మకై రైతులను మోసం చేస్తే బీఆర్ఎస్ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్‌లో పసుపు క్వింటాలుకు రూ. 12 వేలు చేస్తామని హామీ ఇచ్చిందని, మరీ ఇప్పుడు ఎందుకు అమలు చేయడం లేదని వేముల ప్రశ్నించారు. ఎంపీ అర్వింద్ నామమాత్రపు బోర్డు తెచ్చాడని, దానివల్ల లాభమేమున్నదని ప్రశ్నించారు. పసుపుబోర్డు లేనప్పుడు రూ.18 వేలు ధర పలికింది.
బోర్డు వచ్చిన తర్వాత రూ10వేలకు తగ్గింది. రైతులకు ఉపయోగపడని పసుపుబోర్డు బోడిగుండు సున్నాతో సమానమని ఎద్దేవా చేశారు. సాంగ్లిలో రూ.13,800 ధర ఎలా వస్తుంది, నిజామాబాద్‌లో ఎందుకు రావటం లేదని ప్రశ్నించారు. సాంగ్లి, నిజామాబాద్ మార్కెట్‌ను అనుసంధానం చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.12 వేలు ఇస్తామన్న హామీ నెరవేర్చాలని, ఎంపీ అర్వింద్, పసుపుబోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ప్రధానిని కలిసి రూ.15 వేల మద్దతు ధర ఇచ్చే బోర్డు కావాలని డిమాండ్ చేయాలని సూచించారు. కేసీఆర్ హయాంలో ఎల్ఆర్ఎస్ తీసుకొస్తే గగ్గోలు పెట్టిన రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క ..ఇప్పుడు ఎందుకు ఎల్ఆర్ఎస్ కట్టాలని అంటున్నారని నిలదీశారు. ప్రజలెవరూ ఎల్ఆర్ఎస్ కట్టనవసరం లేదని చెప్పారు.