మోర్తాడ్, నవంబర్ 23: రెండేండ్లుగా బతుకమ్మ పండుగకు చీరలను ఇవ్వకుండా ఎగ్గొట్టిన కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయని ఇందిరమ్మ పేరుమీద చీరల పంపిణీ చేస్తున్నదని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వహాయంలో పదేండ్లు బతుకమ్మ చీరల పంపిణీ అట్టహాసంగా కొనసాగిందని గుర్తుచేశారు. ప్రతి నెలా ఉద్యోగికి జీతం వచ్చినట్టు ప్రతి మహిళకూ నెలకు రూ.2,500 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి నెరవేర్చలేదని, రూ.2వేల పింఛన్‌ను రూ.4వేలకు పెంచుతామని మాటతప్పిండ్రు అని మండిపడ్డారు. చీరల పంపిణీ పేరుతో ఇంటికి వచ్చే నాయకులను పింఛన్ బకాయిల మొత్తాన్ని ఇవ్వమని అడగాలని మహిళలకు పిలుపునిచ్చారు.
హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): శ్రీశైలంలో ఏపీ టూరిజం హరిత హోటల్ పేరుతో నకిలీ వెబ్సైట్ నిర్వహిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఏడాదికాలంగా నిర్వహిస్తున్న ఈ నకిలీ వెబ్‌సైట్‌ను గుర్తించారు. బెంగళూరుకు చెందిన ఓ పర్యాటకుడు ఆన్లైన్లో శ్రీశైలంలో హరిత హోటల్ పేరుతో ఉన్న నకిలీ వెబ్‌సైట్‌ను నమ్మి వసతి గది, దర్శనం కోసం రూ.15,950 ఫోన్‌పే ద్వారా బుకింగ్ చేశాడు. ఆదివారం బుకింగ్ రశీదుతో వచ్చి శ్రీశైలంలో స్థానిక పర్యాటక శాఖ రిసార్ట్‌కు వెళ్ళగా ..ఆ రశీదు నకిలీదని టూరిజం సిబ్బంది చెప్పడంతో అవాక్కయ్యాడు. దీంతో హరిత రిసార్ట్ మేనేజర్ సదరు నకిలీ వెబ్సైట్ గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.