హైదరాబాద్, మార్చి 18(నమస్తే తెలంగాణ): ఉద్యమంలో ఉన్నా, ప్రభుత్వంలో ఉన్నా ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చిందని, ఆదినుంచీ అండగా నిలిచిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టంచేశారు. ఎస్సీ వర్గీకరణపై 25 ఏండ్లుగా ఒకే స్టాండ్‌ను కొసాగించిందని చెప్పారు. మాదిగల సామాజిక, ఆర్థిక స్థితిగతులు క్షుణ్ణంగా తెలిసిన కేసీఆర్, న్యాయమైన ఎస్సీ వర్గీకరణకు మొదటినుంచీ మద్దతుగా నిలిచారని తెలిపారు. మంగళవారం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై జరిగిన చర్చలో వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాదిగలను ఓటుబ్యాంకుగా చూడకుండా వర్గీకరణ కోసం పోరాడుతున్న మందకృష్ణ మాదిగ, సంస్థలు, వ్యక్తులు, వ్యవస్థలను, ఉద్యమాన్ని అర్థం చేసుకొని, వారి కార్యాచరణకు ఎప్పటికప్పుడు అండగా ఉన్నారని వివరించారు.
కేసీఆర్ స్వయంగా వెళ్లి మోదీని కోరారు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీలకు ఇచ్చినమాట ప్రకారం వర్గీకరణపై ముందడుగు వేసిందని వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. 2014 నవంబర్ 29న రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని గుర్తుచేశారు. నాటి సీఎం కేసీఆర్ స్వయంగా ప్రధాని మోదీ వద్దకు వెళ్లి తీర్మానం కాపీని అందించి రాజ్యాంగ సవరణ చేయాలని కోరారని తెలిపారు. కేంద్రం నాన్చివేత ధోరణి అవలంబిస్తే తమ ఎంపీలు పోరాటం చేశారని చెప్పారు. వర్గీకరణ పోరాటంలో కొంతమంది అమరులయ్యారని, నాడు గాంధీభవన్ వద్ద జరిగిన ఘటనను వేముల గుర్తుచేశారు. అమరుల కుటుంబాన్ని బీఆర్ఎస్ తరుపున ఆదుకున్నట్టు తెలిపారు. వివిధ కారణాలతో వర్గీకరణ అంశం సుప్రీంకోర్టుకు చేరితే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంప్లీడ్ అయి మంచి లాయర్లను ఏర్పాటు చేసి వర్గీకరణకు అనుకూలంగా వాదనలు వినిపించిందని వివరించారు. ఫలితంగానే 2024 ఆగస్టు 1న వర్గీకరణ హక్కులను ఆయా రాష్ర్టాలకు అప్పగిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని చెప్పారు. ఇప్పుడు వర్గీకరణ కోసం ఎలాంటి కార్యాచరణ తీసుకున్నా, బీఆర్ఎస్ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టంచేశారు.
కాంగ్రెస్, బీజేపీ రెండూ అన్యాయమే చేశాయి
కాంగ్రెస్ పార్టీ పదేండ్లు, బీజేపీ పదేండ్లు మాదిగలకు అన్యాయం చేశాయని వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. ఆ రెండు ఆ పార్టీల వల్లే వర్గీకరణ ఆలస్యమైందని ఆగ్రహం వ్యక్తంచేశారు. 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉషామెహ్రా కమిషన్ సిఫారసులను అమలుచేయలేదని, 2014 నుంచి 2024 వరకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పటికీ, రాజ్యాంగ సవరణ చేయలేదని దుయ్యబట్టారు. నాడు తెలంగాణ ప్రభుత్వం పంపించిన తీర్మానాన్ని కేంద్రం అమలు చేసి ఉంటే, ఈ పదేండ్లు ఆయా ఫలాలు మాదిగ బిడ్డలకు దక్కేవని చెప్పారు.
వర్గీకరణ తర్వాతే స్థానిక ఎన్నికలు పెట్టండి
ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయితే, స్థానిక సంస్థల్లో వారికి అవకాశాలు పెరుగుతాయి కాబట్టి, ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని వేముల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. అదేవిధంగా 2024 ఆగస్టు 1 సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వగానే తదుపరి భర్తీ చేసే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తామని నాడు సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనను గుర్తుచేశారు. కానీ, గత ఆరు నెలల్లో జారీచేసిన నోటిఫికేషన్లలో మాత్రం రిజర్వేషన్లు అమలు చేయకుండా వారికి అన్యాయం చేశారని విమర్శించారు. కనీసం ఇప్పటినుంచైనా భర్తీ చేసే ఉద్యోగాల్లో వర్గీకరణ త్వరగా పూర్తి చేసి, రిజర్వేషన్లు అమలుచేయాలని డిమాండ్ చేశారు.