చౌటుప్పల్, అక్టోబర్ 6 : యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణం గుండా వెళ్లే హైవేపై సోమవారం మూడో రోజు కూడా వాహనాల రద్దీ కొనసాగింది. దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లినవారు శనివారం నుంచే హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో చౌటుప్పల్‌లో మూడు రోజులుగా ట్రాఫిక్ రద్దీ కొనసాగుతున్నది. మండలపరిధిలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాలు నెమ్మదిగా కదలడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చౌటుప్పల్‌లో కూడా ట్రాఫిక్ రద్దీ తీవ్రంగానే ఉంది.
సర్వీసు రోడ్డు వెంట రహదారి పనులు కొనసాగుతుండటంతో రద్దీ మరింత పెరిగింది. సర్వీసు రోడ్డు పనులను గత ఏడాది జూన్‌లో ప్రారంభించారు. ఏడాదిన్నరలోగా పనులు పూర్తి చేయాల్సి ఉంది. సర్వీసు రోడ్డు, డ్రైనేజీ పనులు అసంపూర్తిగా నిలిచాయి. పండుగ రోజుల్లోనే కాకుండా వీకెండ్లో కూడా రద్దీ ఉంటోంది. చౌటుప్పల్‌లో రోడ్డు దాటేందుకు వాహనదారులు గంటలకొద్దీ నరకయాతన పడ్డారు. మూడు,నాలుగు గంటల ప్రయాణానికి పది గంటల సమయం పట్టడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.