హైదరాబాద్, మే 9(నమస్తే తెలంగాణ): భూసార పరిరక్షణ ప్రభుత్వ ధ్యేయమని, భూసారాన్ని రక్షించేందుకు రైతులకు సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు అందించనున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రూ.76.66 కోట్లు ఖర్చుపెట్టి 65 శాతం సబ్సిడీపై రైతులకు 1.46 లక్షల క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. పచ్చిరొట్ట సాగు ప్రోత్సాహంపై మంగళవారం హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డీసీఎంస్, ప్యాక్స్, గుర్తింపబడిన అగ్రో రైతుసేవా కేంద్రాల్లో పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
నేలల పునరుజ్జీవనానికి సేంద్రీయ ఎరువులకు ప్రాధాన్యం ఇవ్వాలని రైతులకు సూచించారు. పచ్చిరొట్ట పైరులైన జీలుగ, పిల్లిపెసర, జనుము సాగుచేసి రైతులు నేలలో కలియదున్నడం ద్వారా భూమిలో భాస్వరం, గంధకం పోషకాలు గణనీయంగా పెరగటంతోపాటు నత్రజని వాడకం 25 నుంచి 30 శాతం తగ్గించవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ప్రత్యేక కమిషనర్ హన్మంతు, సీడ్స్ కార్పొరేషన్ ఎండీ కేశవులు తదితరులు పాల్గొన్నారు.