హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రతీ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో అవసరమైన కూరగాయలు, పండ్లు సొంతంగా పాఠశాలలోనే పెంచుకోవడానికి ఉద్యాన మోడల్‌ను అభివృద్ధి చేస్తున్నామని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ డాక్టర్ దండా రాజిరెడ్డి తెలిపారు. అందులో భాగంగా ‘ఎక గ్రూపు ఫౌండేషన్’తో కలిసి బుధవారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజెర్ల ఉద్యాన కళాశాలలో కెరీర్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాజిరెడ్డి మాట్లాడుతూ ఉద్యానమోడల్ను రాష్ట్రవ్యాప్తంగా అమలుచేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థి ఉద్యాన అంకుర పరిశ్రమల ఏర్పాటుకు నిధులు ఇవ్వడానికి యూనివర్సిటీ సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా భారత వాతావరణ కేంద్రం ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ రాజిరెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ భగవాన్, అసోసియేట్ డీన్ డాక్టర్ పిడిగం సైదయ్య, ఎస్టేట్ ఆఫీసర్ నాగేశ్వర్‌రెడ్డి, అడ్వైజర్ వీరాంజనేయులు, విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.