ములుగు, జూలై17(నమస్తే తెలంగాణ): ములుగులో గురువారం నిర్వహించిన ఇందిరా మహిళాశక్తి వేడుకలో అపశృతి చోటుచేసుకున్నది. ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి సీతక్క తలపై నుంచి కూరగాయల బతుకమ్మ కిందపడింది. మంత్రి సీతక్కకు మహిళా సంఘాల సభ్యులు పూలతో పేర్చిన బతుకమ్మ, బోనాలతో స్వాగతంపలికి, కూరగాయలతో పేర్చిన బతుకమ్మను తలపై పెట్టారు.
మహిళలతో కలిసి సభావేదికకు వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా కూరగాయల బతుకమ్మ మంత్రి తలపై నుంచి కిందపడిపోయింది. ఇది చూసిన కొందరు మహిళలు పూలతో పేర్చిన బతుకమ్మనే తెలంగాణ సంప్రదాయమని తెలిపారు. ఆచారంలోలేని కూరగాయల బతుకమ్మను మంత్రి తలపై పెట్టిన మహిళా సంఘాల తీరుపై మండిపడ్డారు. మంత్రి తలపై పూలబతుకమ్మ, బోనం ఉంటే ఇలా జరిగేదికాదని చర్చించుకున్నారు.