బాసర.. తెలంగాణలోనే కాదు దేశంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. దేశవ్యాప్తంగా పురాతన సరస్వతి దేవాలయాలు కేవలం మూడు ఉంటే అందులో ఒకటి బాసరలో ఉన్నది. అమ్మవారి విగ్రహాన్ని సాక్షాత్తూ వేదవ్యాస మహర్షి ప్రతిష్టించారని పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ మండల దీక్షలతో అనుష్ఠానం చేస్తే సాక్షాత్తూ సరస్వతి అమ్మవారు కలలో ప్రత్యక్షమై నాలుకపై బీజాక్షరాలు రాస్తుందని, అటువంటి వ్యక్తులు గొప్ప పండితులు అవుతారని చెప్తుంటారు. చదువుల తల్లి నిలయం, లక్షలాది భక్తుల ఆరాధ్య స్థలమైన బాసర, నేడు అవాంఛనీయ శక్తులకు ఆలవాలంగా మారింది. నేరాలకు ఘోరాలకు నిలయమవుతున్నది.
ఆంధ్రా నుంచి వచ్చిన ఒక వ్యక్తి స్వామిజీ ముసుగులో స్థాపించిన కేంద్రం పలు వివాదాలకు కారణమవుతున్నది. ఆ స్వామీజీ ఆశ్రమంలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు తీవ్ర అనుమానాస్పదంగా కనిపించడమే కాదు, బాసర ప్రతిష్ఠకు భంగకరంగా మారాయి. ఈ సంఘటనల్లో ఒక చిన్నపిల్లవాడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా మరొక బాలుడు ఏకంగా ప్రాణాలు కోల్పోయాడు. వాళ్లిద్దరూ బీసీ వర్గాలకు చెందినవాళ్లు కావడం గమనార్హం. అయినా అధికార యంత్రాంగం అవసరమైన మేర స్పందిచడంలేదు. బీసీలకు మద్దతుగా ఉంటామని చెప్తున్న అధికార కాంగ్రెస్, స్థానిక బీజేపీ ప్రజాప్రతినిధులు ఈ వ్యవహారంపై నోరు మెదపకపోవడమే కాకుండా ఏపీ నుంచి వచ్చిన వ్యక్తికి అండగా నిలుస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోట్లాది మంది భక్తి విశ్వాసాలతో ముడిపడిన బాసరలో అసలు ఏం జరుగుతున్నది. వేదఘోష జరగాల్సిన బాసరలో నెత్తుటి ఘోషకు కారణాలేమిటి? ప్రత్యేక కథనాలు నేటి నుంచి..
Basara | ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: బాసరలోని ఓ ప్రైవేటు వేద పాఠశాల.. మార్చి 19 రాత్రి… విద్యార్థులందరూ నిద్రిస్తున్నారు. ఆ సమయంలో మరుగుదొడ్డి వద్ద లోహిత్ అనే విద్యార్థి నెత్తుటి మడుగులో పడి ఉన్నాడు. అతడి తలపై గొడ్డలి, కత్తితో దాడి చేసినట్టుగా తీవ్రమైన గాయాలున్నాయి. ఆ బాలుడిని అతడి స్నేహితుడు మణికంఠ గమనించాడు. వేద పాఠశాల నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లాడు. పాఠశాల నిర్వాహకులు దాడి గురించి గోప్యంగా ఉంచారు. బాసరలోని ప్రభుత్వ దవాఖానకు కాకుండా భైంసాలోని ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ బాలుడు కోమాలోకి వెళ్లాడు. ఆ దవాఖాన నిర్వాహకుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు.. హాస్పిటల్‌కు వెళ్లి కేసు నమోదు చేశారు. కానీ.. పోలీసుల దర్యాప్తులో మాత్రం కనీస పురోగతి కనిపించడంలేదు. బాసర వేద పాఠశాల ముసుగులో అక్కడ.. అసలేం జరుగుతున్నది? ఇంతఘోరమైన నెత్తుటి ఘోషకు కారకులెవరు? నిజాలు వెలికితీయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే!
బాసర సరస్వతీదేవి క్షేత్రం చిన్నారుల అక్షరాభ్యాసాలకు ప్రసిద్ధి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి అక్షరాభ్యాసాల కోసం తల్లిదండ్రులు తమ పిల్లలతో తరలివస్తుంటారు. బాసరలో అక్షరాలు దిద్దిన పిల్లలు చదువులో రాణిస్తారని వారి విశ్వాసం. అయితే బాసరలోనే కొన్నేండ్ల క్రితం వేదవిద్యానందగిరి స్వామీజీ అనే ఆయన అన్నికులాల విద్యార్థుల నాలుకపై బీజాక్షరాలు రాస్తామంటూ శ్రీ వేదభారతి పీఠం పేరుతో పాఠశాల ప్రారంభించారు. ఆశ్రమ పాఠశాల తరహాలో భోజన, వసతి, విద్యాబోధన సౌకర్యాలు కల్పిస్తున్నారు. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలో చేర్పిస్తున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఘనాపూర్ గ్రామానికి చెందిన అగ్గిడి లోహిత్ కుమార్‌ను కూడా తల్లిదండ్రులు మూడేండ్ల క్రితం ఈ పాఠశాలలో చేర్పించారు. మూడేండ్లుగా లోహిత్ కుమార్.. అక్కడే ఉండి చదువుకుంటున్నాడు. మార్చి 20న తెల్లవారుజామున పాఠశాల ప్రాంగణంలోని మరుగుదొడ్డి సమీపంలో నెత్తుటి మడుగులో పడి ఉండడాన్ని మణికంఠ అనే తోటి విద్యార్థి గమనించాడు. ఈ విషయాన్ని ఆశ్రమ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లాడు. నిర్వాహకులు విద్యార్థి తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం ఇవ్వకుండా, చికిత్స కోసం బాసరలోని ప్రభుత్వ దవాఖానకు తరలించకుండా భైంసాలోని
ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు.
భైంసాకే ఎందుకంటే!
భైంసాలోని ప్రైవేటు దవాఖాన పాఠశాల నిర్వాహకుడైన స్వామీజీ శిష్యుడిదేనని తెలుస్తున్నది. అక్కడ వైద్యం అందించే డాక్టర్ విద్యార్థికి తగిలిన గాయాలు చూసి అనుమానించాడు. ఏం జరిగిందని ప్రశ్నించగా.. కొండముచ్చు దాడి చేసిందని పాఠశాల నిర్వాహకులు చెప్పారు. కానీ గాయాలు చూస్తే గొడ్డలితోనో, కత్తితోనో వేటు వేసినట్టుగా ఉండటంతో ఆ డాక్టర్ బాసర ఎస్సైకి ఫిర్యాదు చేశాడు. హాస్పిటల్‌కు చేరుకున్న ఎస్సై, సీఐ విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వైద్యులు చికిత్స కొనసాగించారు. 20వ తేదీ మధ్యాహ్నం భైంసాకు చేరుకున్న బాలుడి తల్లిదండ్రులు, బంధువులు విద్యార్థితో మాట్లాడేందుకు ప్రయత్నం చేయగా..“తాత దగ్గర” అని ఏదో చెప్పబోయి స్పృహ కోల్పోయి, కోమాలోకి వెళ్లాడు. విద్యార్థి బంధువులు ఆశ్రమ పాఠశాలకు, అక్కడి నుంచి బాసర పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆశ్రమ నిర్వాహకులను నిలదీశారు. విద్యార్థికి అంత తీవ్రమైన గాయాలైతే పోలీసులకు ఫిర్యాదు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. రాత్రి 8.30 గంటలకు విద్యార్థి మేనమామ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆధారాలు ఎందుకు దొరకలేదు?
బాసర పోలీసులకు ఫిర్యాదు అందిన మరుసటి రోజు అంటే మార్చి 21న ఉదయం వేద పాఠశాలలో నిర్మల్ జిల్లా ఎస్పీ జానకీ షర్మిల, భైంసా ఏఎస్పీ అవినాశ్‌కుమార్ ఐదు గంటల పాటు విచారణ జరిపారు. పాఠశాలలో నిర్వాహకులను, విద్యార్థులను ప్రశ్నించారు. కానీ ప్రతీ విద్యార్థి ఒకటే సమాధానం చెప్పడం పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఏ విద్యార్థిని అడిగినా పొద్దున సంధ్యావందనం చేసేటప్పుడు లోహిత్ కనిపించలేదు. వెతికితే మరుగుదొడ్ల సమీపంలో కనిపించాడు. అతడిపై కొండ ముచ్చు దాడి చేసి ఉంటుంది. మాకు ఇంతే తెలుసు అని ఒకటే సమాధానం చెప్పారని సమాచారం. కొందరు విద్యార్థులను మళ్లీ మళ్లీ అడిగినప్పటికీ పాఠం బట్టీ పట్టినట్టుగా ఇదే విషయం అప్పగించారని ఓ పోలీసు అధికారి తెలిపారు. లోహిత్ గాయాలతో కనిపించింది.. 20వ తేదీ తెల్లవారుజామున పాఠశాలలో 19వ తేదీ మధ్యాహ్నం 3.20 గంటల నుంచి 20వ తేదీ లోహిత్‌ను దవాఖానకు తరలించే వరకు సీసీ కెమెరాల్లో ఎలాంటి దృశ్యాలు రికార్డు కాలేదు. ఎందుకు రికార్డు కాలేదని పోలీసులు పాఠశాల నిర్వాహకులను అడిగితే ఇతర స్విచ్‌లు ఆఫ్ చేస్తున్నప్పుడు సీసీ కెమెరా స్విచ్ కూడా ఆఫ్ అయిందని చెప్పుకొచ్చినట్టు తెలిసింది. దీంతో అసలు లోహిత్‌పై దాడి ఎవరు చేశారనేది మిస్టరీగా మిగిలిపోయింది.
షాక్ నుంచి బయటపడని లోహిత్
లోహిత్ 20 రోజుల క్రితం కోమాలో ఉండి, బయటికి వచ్చాడని బాలుడి మామయ్య అశోక్‌కుమార్ తెలిపారు. అతడు మానసికంగా చాలా దెబ్బతిన్నాడని.. గాయాలు తగ్గినా రోజంతా నిస్సత్తువగా పడుకొనే ఉంటున్నాడని చెప్పారు. దాడి ఎలా జరిగింది? అని అడిగితే తలనొప్పికి గురవుతున్నాడని వెల్లడించారు. లోహిత్ చదువు గురించిన వివరాలు చెప్తున్నాడని, దాడి ప్రస్తావన తీసినప్పుడు మాత్రం జ్వరం వస్తున్నదని వివరించారు. తీవ్రగాయాల వల్ల మెదడులో నరాలు దెబ్బతిన్నాయని వైద్యులు చెప్పారని, అందువల్ల వివరాలు తెలుసుకునేందుకు లోహిత్‌పై ఎక్కవ ఒత్తిడి చేయడంలేదని చెప్పారు. లోహిత్‌ను భైంసాలోని దవాఖాన నుంచి నిర్మల్‌లోని మరో హాస్పిటల్‌కు తరలించినట్టు తెలిపారు. మరింత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించనున్నట్టు చెప్పారు. లోహిత్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనగా ఉందని, న్యాయం కోసం త్వరలో పోలీసులను కలుస్తామని తెలిపారు. లోహిత్ ప్రస్తుతం ఎలా ఉన్నాడో తెలిపేందుకు, ఫొటోలు ఇచ్చేందుకు నిరాకరించారు.
కేసులో కొత్త ట్విస్ట్
లోహిత్‌పై దాడి జరిగి 40 రోజులు పూర్తయినా కేసు దర్యాప్తులో పురోగతి లేదు. దాడికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు దొరకలేదని పోలీసులు చెప్తున్నారు. సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, పిల్లలంతా ఒకటే సమాధానం చెప్తుండటంతో తాము ఏమీ చేయలేకపోతున్నామని వెల్లడించారు. మార్చి 19 సాయంత్రం వరకు ఏం జరిగిందో చెప్తున్న లోహిత్ ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పలేకపోతున్నాడని వివరించారు. పాఠశాల నిర్వాహకులపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు తెలిపారు. దర్యాప్తులో స్పష్టత వచ్చిన తర్వాత చార్జిషీట్ దాఖలు చేస్తామని వెల్లడించారు. మరోవైపు హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకొని విచారించకపోవడం ఏంటని బాలుడి తల్లిదండ్రులు, బంధువులు ప్రశ్నిస్తున్నారు. ఏం జరిగిందో చెప్పలేని పరిస్థితిలో బాధిత బాలుడు.. పాఠశాలలో దొరకని ఆధారాలతో పోలీసు దర్యాప్తు ముందుకుసాగడంలేదు. ఒకే ఒక్క ఆధారమని పోలీసులు భావించిన వ్యక్తి… లోహిత్‌ను ముందుగా చూసిన మణికంఠ. అతడు లోహిత్‌కు అత్యంత సన్నిహితుడు. ఆశ్రమంలో కలిసిమెలిసి ఉండేవాళ్లు. లోహిత్ తీవ్రగాయాల వెనుక ఏం జరిగి ఉంటుందో అతడికి ఏమైనా తెలిసే అవకాశముంటుంది. కేసులో అతడే ముఖ్యమైన సాక్షి. కానీ ఇక్కడే కేసు కీలక మలుపు తిరిగింది. నెత్తుటి మడుగులో లోహిత్‌ను ముందుగా చూసిన మణికంఠ 15 రోజుల తర్వాత ఏప్రిల్ 4న విద్యుత్‌షాక్‌తో మృతి చెందాడు.