Chidvilas reddy | హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ ): సోషల్ మీడియాకు, సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండటం. అప్పుడప్పుడు ఇండోర్‌గేమ్స్ ఆడ టం. రోజుకు 10 నుంచి 12 గంటల పాటు చదవడం. ఫ్యాకల్టీ చెప్పినట్టు నడుచుకోవడం.. ఈ సోపానాలే తనకు విజయాన్ని తెచ్చిపెట్టాయని జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆలిండియా మొదటి ర్యాంకు సాధించిన వావిలాల చిద్విలాస్ రెడ్డి తెలిపారు. తాను 9వ తరగతి నుంచే జేఈఈకి సన్నద్ధమయ్యానని, కొవిడ్ సమయంలో రెగ్యులర్‌గా క్లాసులు జరుగని పరిస్థితుల్లో కూడా చదవడం వదిలేయలేదని చెప్పారు. జూమ్ క్లాసులకు హాజరవడం, సొంతంగా కష్టపడటం వల్లే పునాది బలంగా ఏర్పడి తాను ఈ రోజు ఆలిండియా ఫస్ట్ ర్యాంక్‌ను సాధించేందుకు దోహదపడ్డాయని పేర్కొన్నారు. జేఈఈ ర్యాంకుతో ఐఐటీ ముంబైలో సీఎస్ఈ కోర్సులో చేరి, రిసెర్చ్ రంగంలో రాణించి.. సామాన్యుల అవసరాలు తీర్చే సాంకేతికతను అభివృద్ధి చేస్తానని చిద్విలాస్‌రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు.
మాది నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట. అమ్మ నాగలక్ష్మీ, నాన్న రాజేశ్వర్రెడ్డిలిద్దరూ టీచర్లే. హైదరాబాద్‌లోని హస్తినాపురంలో స్థిరపడ్డాం. 1 నుంచి మూడో తరగతి వరకు నాగర్‌కర్నూల్‌లో, 4,5 తరగతులు హస్తినాపురంలో, 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు శ్రీచైతన్య విద్యాసంస్థల్లో పూర్తిచేశా. ఇక్కడే జేఈఈకి శిక్షణ తీసుకొన్నా. గణితం సమస్యల పరిష్కారానికి నాన్న రాజేశ్వర్‌రెడ్డి చిట్కాలు చెప్పేవారు.
నాకు టైమ్ వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. ఫోన్తోను టైంపాస్ చేయను. క్రికెట్ చూసేటో డిని కాదు. నిమిషం వృథా చేయొద్దన్న ఆలోచనతో ప్రిపేరయ్యా.
నా ప్రిపరేషన్.. నా ఫోకస్ అంతా జేఈఈ పైనే ఉండేది. ఎల్లప్పుడు చదవడం మంచిదికాదని తల్లిదండ్రులు సలహాలిచ్చేవారు. విరా మ సమయంలో రోజుకు అరగంట నుంచి గంటపాటు ఫూజ్బాల్ (FOOS BALL), టేబుల్ టెన్నిస్ అడుతూ ఒత్తిడి నుంచి బయటపడేవాడిని. దీంతో ప్రిపరేషన్ కష్టమనిపించలేదు. చదివే సమయంలో కూడా అరగంట పాటు విశ్రాంతి తీసుకొన్నాను.
ప్రతి సబ్జెక్టునూ ప్రణాళిక ప్రకారం చదివాను. రెండు గంటలు గణితం, మూడు గంటలు ఫిజిక్స్‌కు కేటాయించి మిగిలిన సమయాన్ని వీలును బట్టి చదివాను. సబ్జెక్టుకు అరగంట చొప్పున విశ్రాంతి తీసుకొని రాత్రిపూట కెమిస్ట్రీ పాఠాలను రివిజన్ చేశాను. నెగెటివ్ మార్కులుండటంతో కాన్ఫిడెంట్‌గా ఉన్న ప్రశ్నలకే ఆన్సర్చేశా. దీంతోనే 360 మార్కులకు 341 మార్కులతో ఆలిండియా మొదటి ర్యాంకు సాధించా.
ఒకేతరహా పుస్తకాలను ఎంచుకోవాలి. మార్కెట్లో దొరికేవన్నీ ముందేసుకోవద్దు. వీలైనన్నీ ఎక్కువ మాక్‌టెస్ట్‌లు రాయాలి. ప్రణాళికతో చదవాలి. సబ్జెక్టు తప్ప మరేం చేయరాదు. ఉదయాన్నే లేచి ప్రిపరేషన్ కావడం ఉత్తమం.