గోదావరిఖని : సింగరేణిలో యాజమాన్యం గుర్తించిన బొగ్గు బ్లాక్‌లను సింగరేణికి ఇవ్వకుండా టెండర్ ప్రక్రియ ద్వారా ప్రైవేటు సంస్థలకు ఇస్తే బొగ్గు తవ్వకాలను అడ్డుకుంటామని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య హెచ్చరించారు. మంగళవారం ఆయన గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాక్ లను సింగరేణి కి ఇవ్వకుండా టెండర్ ప్రక్రియ ద్వారా ఆదాని గ్రూప్, ఏ.ఎం.ఆర్, మెగా కృష్ణా రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన జెన్ కో సంస్థలు టెండర్ లో పాల్గొనేందుకు టెండర్ ఫారాలు కొనుగోలు చేశారని ఆయన ఆరోపించారు.
సింగరేణి బొగ్గు బ్లాక్స్ ప్రైవేటు కు వెళితే సింగరేణి మనుగడ కుంటుపడుతుందని ఆయన ఆరోపించారు. కార్మికులు, అధికారుల భవిష్యత్తు అంధకారంలోకి వెళుతుందని ఆయన పేర్కొన్నారు. సింగరేణి కి చెందిన బొగ్గు గనులు దక్కాలంటే కోల్ బెల్ట్ ఎమ్మెల్యే లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పై ఒత్తిడి చేయాలని ఆయన కోరారు. అదేవిధంగా సింగరేణిలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు సింగరేణి పరిరక్షణ సమితి పేరుతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అన్ని రాజకీయ పార్టీలు, యూనియన్ లు చేసిన పోరాటాల స్ఫూర్తితో సింగరేణిలో ఉద్యమాలు చేయడం వల్ల సింగరేణి మనుగడ కొనసాగుతుందన్నారు.
ప్రభుత్వాల తీరు మారకుంటే సింగరేణి పరిరక్షణ సమితి పేరుతో అన్ని కార్మిక సంఘాలను, రాజకీయ పార్టీలను, కోల్ బెల్ట్ శాసనసభ్యుల తో కలిసి పోరాటాలు, ఉద్యమాలు చేస్తామని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గౌతం గోవర్ధన్, ఏఐటియుసి ఆర్జీ త్రీ బ్రాంచి కార్యదర్శి మందల రాంచంద్రారెడ్డి, నాయకులు సిర్ర మల్లికార్జున్, దాసరి శ్రీనివాస్, ఇజ్జగిరి రాజు, దాసరి అనిల్, ఆజీం పాషా, ఆకుల సురేష్, కీర్తి శేఖర్, దేవేందర్ రెడ్డి, బొల్లి శ్రీనివాస్, దోరగండ్ల మల్లయ్య, ఎర్రగొల్ల చేరాలు, ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేశ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.