హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ)లో పరిపాలనపరమైన సంస్కరణలు చేపట్టేందుకు వర్సిటీ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. వరంగల్ నిట్ రిజిస్ట్రార్ ఎస్ గోవర్ధన్‌రావు, జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్, ఓయూ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కే ప్రతాప్‌రెడ్డితో కూడిన త్రిసభ్య కమిటీ శుక్రవారం హైదరాబాద్‌లో తొలి సమావేశం నిర్వహించింది. సమావేశంలో ఇన్చార్జి వీసీ వెంకటరమణ, డైరెక్టర్ సతీశ్‌కుమార్ పాల్గొన్నారు. ఆర్జీయూకేటీలో చేపట్టాల్సిన సంస్కరణలపై చర్చించారు. యూనిఫారాల సేకరణకు టెండర్లు పిలవాలని, షూస్‌ను నెడ్‌క్యాప్ ద్వారా సేకరించాలని నిర్ణయించారు. ఇన్చార్జీ వీసీ విజ్ఞప్తి మేరకు ప్రస్తుతం ప్రభుత్వమే విద్యార్థులకు ఉచితంగా మందులను సరఫరా చేస్తున్నది. ఎప్పటికప్పుడు విద్యార్థులకు వైద్యపరీక్షలు చేస్తూ వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు అడిగి తెలుసుకొంటున్నారు.