సూర్యాపేట, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ)/కమ్మర్పల్లి/వనపర్తి: బీఆర్ఎస్లో చేరికల జోష్ కనిపించింది. ఆదివారం సూర్యాపేట, నిజామాబాద్, వనపర్తి జిల్లాల్లోని వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరారు. వీరికి ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. సూర్యాపేట జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, ఆల్ ఇండియా ముస్లిం రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు ఎండీ ఖాలేద్ అహ్మద్ సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లో భవిష్యత్తు మొత్తం బీఆర్ఎస్ పార్టీదేనని ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను యావత్ దేశం గమనిస్తున్నదని చెప్పారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన సరిహద్దు రాష్ర్టాల ప్రజలు తమ ప్రాంతాలను తెలంగాణలో కలుపాలని డిమాండ్ చేస్తూన్నారని గుర్తుచేశారు. బీజేపీ ఏలుబడిలో ఉన్న కర్ణాటకలో కూడా డిమాండ్ వినిపిస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్ తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష: వేముల ప్రశాంత్‌రెడ్డి
దేశానికి, రాష్ర్టానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం చౌట్పల్లికి చెందిన పలువురు బీజేపీ, బీఎస్పీ నాయకులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆయా పార్టీల నాయకులు కొమ్ముల వెంకన్న, కొట్టాల రాజేశ్వర్, బద్దం రాజేశ్వర్, బేల్దారి సందీప్, బేల్దారి ప్రవీణ్, వంజరి గణేశ్, ఏలేటి రాంచందర్, కుర్మా మహేశ్ తదితరులకు మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్కు రోజురోజుకూ దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతున్నదని వివరించారు. తెలంగాణలోని సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలనే డిమాండ్ ప్రజల నుంచి వస్తున్నదని చెప్పారు.
బీఆర్ఎస్ మరింత బలోపేతం: మంత్రి నిరంజన్‌రెడ్డి
బీఆర్ఎస్ పార్టీ దేశంలో బలీయమైన శక్తిగా ఎదుగుతున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయాలన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించారని తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో వనపర్తి జిల్లా రేవల్లి మండలం చెన్నారం గ్రామానికి చెందిన 60 మంది నాయకులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని, సంక్షేమ పథకాల అమలులో దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. అందుకే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని పేర్కొన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీశ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.