గజ్వేల్, జూలై 3: కాళేశ్వరంలో కుంగిన పిల్లర్లకు పది రోజుల్లో మరమ్మతు చేయని పక్షంలో త్వరలోనే 10 వేల మంది రైతులతో రాజీవ్ రహదారిని దిగ్బంధిస్తామని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రైతుల కోసం బీఆర్ఎస్ ప్రాణత్యాగాలకు సిద్ధంగా ఉన్నదని అన్నారు. రాజీవ్ రహదారి దిగ్బంధం కేసులు పెట్టినా భయపడేది లేదని స్పష్టం చేశారు.
ప్రభుత్వం వెంటనే రూ.100 కోట్లు ఖర్చు చేసి మరమ్మతు పనులు వేగంగా చేపట్టాని డిమాండ్ చేశారు. రెండు లక్షల కోట్లు అప్పు చేసిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రెండు రూపాయలు ఖర్చు చేయలేదని దుయ్యబట్టారు. మిడ్ మానేరు నుంచి లోయర్ మానేరును నింపుకొని కాకతీయ కాలువల ద్వారా వరంగల్, ఖమ్మం జిల్లాలకు సాగునీరు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కు దక్కిందని అన్నారు. మిడ్ మానేరు నుంచి అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్లకు నీళ్లు తీసుకొచ్చి రైతాంగానికి సాగునీటిని కేసీఆర్ అందించిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు.