ముషీరాబాద్, నవంబర్ 18: అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పక్కనబెట్టిన కాంగ్రెస్, మరోమారు మాదిగలను మోసం చేయడానికే ఆర్డినెన్స్ తెస్తామంటున్నదని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసిన పంపితే 3 సార్లు అడ్డుకున్నది కాంగ్రెస్సేనని మండిపడ్డారు.
శనివారం ఆయన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 30 ఏండ్ల ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని ముందుకు కదలనీయకుండా అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీయేనన్న విషయాన్ని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే గుర్తు పెట్టుకోవాలని, మళ్లీ వర్గీకరణ, ఆర్డినెన్స్ అంటే మాదిగలు కాంగ్రెస్ను నమ్మడానికి సిద్ధంగా లేరని తేల్చి చెప్పారు. అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పి మోసం చేసింది బీజేపీ అని మండిపడ్డారు. ఎన్నికల్లో లబ్ధి కోసం కమిటీ వేస్తామని ప్రధాని కల్లబొల్లి మాటలతో మాదిగ సమాజాన్ని మరోసారి మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో ఎంఎస్ఎఫ్ నాయకులు వెంకట్, చందు, నాగరాజు, సురేశ్, కిరణ్, శ్రీకాంత్, కార్తీక్, మణి తదితరులు పాల్గొన్నారు.