Vande Bharat | భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా పలు నగరాల మధ్య ఈ రైళ్లు దూసుకెళ్తున్నాయి. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ కొత్తగా ఆరు వందే భారత్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో నాగ్‌పూర్ – సికింద్రాబాద్ మధ్య తొలి వందే భారత్ రైలును ప్రధాని ప్రారంభించారు. ఇక ఈ రైలు ఈ నెల 19 నుంచి అందుబాటులో ఉండనున్నది. ప్రతి మంగళవారం మినహా మిగతా ఆరు రోజులు పరుగులు తీస్తుంటుంది. ఈ సెమీ హైస్పీడ్ రైలు ప్రతిరోజు ఉదయం 5 గంటలకు నాగ్‌పూర్ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరుతుంది. 5.43 గంటలకు సేవ్గ్రామ్కు చేరుతుంది.
అక్కడి నుంచి 7.03 గంటలకు చంద్రాపూర్‌కు చేరుకొని.. 7.05 గంటలకు బయలుదేరుతుంది. 7.20 గంటలకు బల్హార్షా చేరుకొని.. 7.25 గంటలకు బయలుదేరి.. 9.08గంటలకు రామగుండం స్టేషన్‌కు వస్తుంది. 10.04గంటలకు కాజీపేట, మధ్యాహ్నం 12.15 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుతుంది. ఇక తిరుగు ప్రయాణంలో ఒంటిగంటకు బయలుదేరి.. ఆయా స్టేషన్ల మీదుగా రాత్రి 8.20 గంటలకు నాగ్‌పూర్‌కు చేరుకుంటుంది. ఇక ఈ రైలులో 20 కోచ్‌లు ఉంటాయి. ఇందులో రెండు ఎగ్జిక్యూటివ్, 18 చైర్‌కార్ కోచులు ఉంటాయి. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కేవలం 16, ఎనిమిది కోచ్‌లతో మాత్రమే వందే భారత్ రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా.. నాగ్‌పూర్ – సికింద్రాబాద్ మధ్య నడిచే ఈ రైలుకు మాత్రం 20 కోచ్‌లు ఉండనున్నాయి.
మహారాష్ట్ర – తెలంగాణ మధ్య తొలి వందే భారత్ రైలు కాగా.. వ్యాపారులు, ఐటీ ప్రొఫెషనల్స్, విద్యార్థులు, ఇతర అవసరాల కోసం ప్రయాణించే వారికి ఈ రైలు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇక టికెట్ విషయానికి వస్తే సికింద్రాబాద్ నుంచి నాగ్‌పూర్ వరకు చైర్‌కార్‌కి రూ.1500.. ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్‌కి రూ.2875గా ధర నిర్ణయించారు. సికింద్రాబాద్ నుంచి వరంగల్‌కు ఏసీ ఛైర్‌కార్ రూ.710, ఎగ్జిగ్యూటివ్ ఛైర్‌కార్ ధర రూ.1,195గా ఉన్నది. సికింద్రాబాద్ నుంచి రామగుండం వరకు ఏసీ చైర్‌కార్‌లో రూ. 865 కాగా.. ఎగ్జిగ్యూటివ్ చైర్‌కార్‌లో రూ.1,510గా నిర్ణయించింది. ఇక ఈ రైలుకు 20101-20102 నంబర్ కేటాయించారు.