వనపర్తి : ప్రణాళికాబద్దంగా వనపర్తిని అభివృద్ధి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
అన్నారు. జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ దివ్యాంగుల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. దివ్యాంగులకు ప్రతి మండలంలో ఐదు శాతం డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయిస్తామన్నారు. జిల్లా కేంద్రంలో దివ్యాంగుల భవనం నిర్మాణం కోసం పది గుంటల భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశామని మంత్రి వెల్లడించారు.
అలాగే వనపర్తి అభివృద్ధికి రూ.10.25 కోట్లను సీఎం కేసీఆర్ ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి మంజూరు చేశారన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో టౌన్ హాల్ నిర్మాణానికి రూ.5 కోట్లు నియోజకవర్గంలోని ఏడు మండల కేంద్రాలలో అన్ని వర్గాల సామాజిక భవనాల కోసం ఒక్కొక్క దాని కోసం రూ.75 లక్షల చొప్పున నిర్మాణం చేస్తామన్నారు.
కర్నెతండా లిఫ్ట్ నిర్మాణానికి ఇటీవలే రూ.76.19 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు.
ఇది వరకే మెడికల్, నర్సింగ్ కళాశాలలు మంజూరయ్యాయని, వచ్చే ఏడాది నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని మంత్రి స్పష్టం చేశారు. వేరుశనగ పరిశోధన కేంద్రం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తామన్నారు. జిల్లా అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.