హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ వివాదం ఇప్పట్లో సద్దుమనిగేలా కనిపించడం లేదు. సీఎం రేవంత్‌రెడ్డిపై మంత్రి కుమార్తె సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో సురేఖపై విమర్శల పరంపర కొనసాగుతున్నది. తాజాగా ఈ అంశంపై ఆదివారం గాంధీభవన్ వేదికగా మంత్రి వాకిటి శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. ముందు కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాతే ఎవరైనా అని చెప్పారు.
పార్టీకి నష్టం కలిగిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ అనే తేడా లేకుండా ఎవరిపైనైనా చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. నష్టం జరిగితే పార్టీని కాపాడాల్సిన బాధ్యత పీసీసీకి ఉంటుందని తెలిపారు. సురేఖపై ఎవరూ కుట్ర చేయాల్సిన అవసరం లేదన్న శ్రీహరి, బీసీలపైనే కుట్ర జరుగుతున్నదనే ప్రచారంలో నిజం లేదని పేరొన్నారు. పెద్దరికం చేసేటప్పుడు భూదేవికి ఉన్నంత ఓపిక ఉండాలని.. సురేఖ, చిన్నారెడ్డి ఎవరైనా పార్టీకి డ్యామేజీ కానంత వరకేనని పేర్కొన్నారు. ఇప్పటికే చిన్నారెడ్డికి కూడా కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ నోటీసులు ఇచ్చిందని తెలిపారు.