మహబూబ్‌నగర్ అర్బన్, మార్చి 8 : అమరరాజా గిగా ఫ్యాక్టరీ-1 పూర్తైతే తెలంగాణ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో అమరరాజా గిగా ఫ్యాక్టరీ-1కి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ విజయేందిరబోయి, అమరరాజా గ్రూప్ కంపెనీ చైర్మన్ గల్లా జయదేవ్‌లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దివిటిపల్లిలో నిర్మిస్తున్న అమరరాజా గిగా ఫ్యాక్టరీ శంకుస్థాపనతో ఒక ముందడుగు పడిందని, తద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. అమరరాజా కంపెనీ 80 శాతం మహిళా ఉద్యోగులను నియమించుకోవడం అభినందనీయమన్నారు. పుష్ప సినిమా డైలాగ్‌ను ప్రస్తావిస్తూ తగ్గ్గేదేలే అని.. దివిటిపల్లి అభివృద్ధి ఆగదు.. నిరంతరంగా కొనసాగుతుందన్నారు. అనంతరం గల్లా జయదేవ్ మాట్లాడుతూ.. రానున్న పదేండ్లలో తెలంగాణలో రూ.9,852 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు.