చెన్నై : పొట్టి ప్రపంచకప్‌ను ఆఫ్ఘానిస్థాన్ భారీ విజయంతో ముగించింది. భారీ అంచనాలతో టోర్నీ బరిలోకి దిగిన ఆ జట్టు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమణకు గురైనా ఆఖరి రెండు మ్యాచ్‌లు గెలుచుకుని ఓదార్పు విజయాలనందుకుంది. గ్రూప్-డీలో భాగంగా కెనడాతోచెన్నైలో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ సేన.. కెనడాపై 82 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ ఇబ్రహీం జద్రాన్ (56 బంతుల్లో 95 నాటౌట్, 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) తృటిలో శతకాన్ని మిస్ చేసుకున్నా ఆ జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.
జద్రాన్ మెరుపులతో ఆఫ్ఘాన్ 20 ఓవర్లకు 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 200 రన్స్ చేసింది. సెదికుల్లా (44), ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (30) అతడికి అండగా నిలిచారు. భారీ ఛేదనలో కెనడా 33 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి ఆ తర్వాత ఏ దశలోనూ లక్ష్యం వైపుగా సాగలేదు. ఆఫ్ఘాన్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో ఆ జట్టు 118/8కే పరిమితమైంది. హర్ష్ ఠాకర్ (30) టాప్ స్కోరర్. ఈ ప్రపంచకప్‌లో కెనడా ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగూ ఓడింది.