హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 17(నమస్తే తెలంగాణ): వాహన్ సారథి పోర్టల్ వరుసగా మూడో రోజు పనిచేయలేదు. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఆర్టీవో కార్యాలయాల్లో సేవలు అందక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 3 గంటలపాటు సర్వర్ మొరాయించినట్టు అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉన్నదని, హ్యాకర్లే దీనికి కారణం కావొచ్చని పోర్టల్స్‌ను నిర్వహించే ఎన్ఐసీ(నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్)కి చెందిన ఓ కోఆర్డినేటర్ అభిప్రాయపడ్డారు. సైబర్ భద్రతా వ్యవస్థలు ఇప్పటివరకు హ్యాకింగ్ జరిగినట్టు తేల్చలేదని పేర్కొన్నారు.
డేటా సురక్షితం గా ఉన్నదని తెలిపారు. సాంకేతిక లోపంతో రాష్ట్ర వ్యాప్తంగా 30వేల మంది కార్యకలాపాలు పెండింగ్‌లో ఉన్నాయి. రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్, పర్మిట్స్, జరిమానాల చెల్లింపు తదితర కార్యకలాపాలు పొందలేక వాహనదారులు కార్యాలయాల్లోనే ఎదురుచూడాల్సి వచ్చింది. కౌంటర్లు తెరిచి ఉంచి నా ఆన్లైన్ వ్యవస్థ అందుబాటులో లేకపోవడంతో అధికారులు దరఖాస్తులను పరిశీలించలేకపోయారు. స్లాట్ బుక్ చేసుకున్న దరఖాస్తుదారులు తమ సేవలను రీషెడ్యూల్ చేసుకోవాల్సి వచ్చింది. తెలంగాణలో వాహన్-సారథిని అందుబాటులోకి తెచ్చినప్పటి నుంచి సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి.