హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి లాభం కన్నా నష్టమే ఎక్కువ అని ఏపీ రైతు సంఘం నేత, ఉమ్మడి రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర్రావు స్పష్టం చేశారు. బనకచర్ల ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఏపీకి తరలించేందుకు ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబునాయుడు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో వడ్డే వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. కృష్ణా నదిలో మిగులు జలాలను వాడుకోకుండా గోదావరి మిగులు జలాలపై పడడం ఏమిటని ఆయన ఓ డిజిటల్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. ముందు కృష్ణా మిగులు జలాల వాడకంపై దృష్టి పెట్టాలని ఏపీ ప్రభుత్వానికి సూచించారు.
గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును నిర్మించాలన్న చంద్రబాబు ఆలోచన అసమంజసమైనది, అసంబద్ధమైనది అని శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు. ‘దీనివల్ల ఏపీకి ఉపయోగం కన్నా నష్టమే ఎక్కువ. ఈ ప్రాజెక్టు వల్ల కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ హక్కులకు భంగం కలుగుతుంది. కృష్ణా జలాలపై ఇతర రాష్ర్టాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో పాటు విజయవాడ నగరానికి బుడమేరు ముప్పు ఇంకా పెరుగుతుంది. ఇది అత్యంత ప్రమాదకరమైనది’ అని హెచ్చరించారు.
ఇప్పటికీ కృష్ణా నదిలో కొన్నిసార్లు 500 టీఎంసీలు, మరికొన్నిసార్లు వెయ్యి టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని శోభనాద్రీశ్వర్రావు చెప్పారు. ‘కృష్ణా బ్యారేజీ వద్ద మూడు టీఎంసీలను మాత్రమే నిల్వ ఉంచుకోగలం. అయితే సముద్రంలో కలుస్తున్న నీటిని దొరకబట్టి వినియోగించుకోవచ్చు. వైకుంఠపురం వద్ద ఒక బ్యారేజీ నిర్మించి.. ఆబ్యారేజీ వద్ద నీళ్లను ఆపేసి.. గుంటూరు వద్ద నాగార్జునసాగర్ కుడి కాలువలోకి ఎత్తిపోయాలి. కుడి కాలువ దిగువన ఉన్న రైతులకు సరిపడా నీళ్లు అందుతాయి. గతంలో పొగాకు పంట సాగుపై ఎక్కువ ఆసక్తితో రైతులు సాగర్ కాలువలు వద్దన్నారు. ఇప్పుడేమో ఇతర పంటలకు మారిన ఆ రైతులే కాలువ కావాలంటున్నారు. కాబట్టి నాగార్జునసాగర్ ప్రధాన కాలువను, డిస్ట్రిబ్యూటరీ కాలువలను విస్తరించి కృష్ణా మిగులు జలాలను వినియోగించుకోవచ్చు’ అని వివరించారు.
ఏపీ ప్రభుత్వం ముందుగా గోదావరి వరదల జలాలను వాడడం కన్నా.. కృష్ణాలో ఉన్నటువంటి వరద జలాలను వాడుకోవాలని శోభనాద్రీశ్వర్రావు సూచించారు. ‘కృష్ణా జలాల్లో మిగులు నీళ్లను శ్రీశైలం నుంచి గ్రావిటీ పద్ధతిలో పోతిరెడ్డిపాటు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా గాలేరునగరి, కేసీ కెనాల్ ఇతర ఇరిగేషన్ వ్యవస్థకు వినియోగించవచ్చు. దీనివల్ల రాష్ట్రంపై ఆర్థిక భారం కూడా ఎక్కువగా పడదు. ఒకవేళ గోదావరి జలాలను బొల్లాపల్లి రిజర్వాయర్‌కు కచ్చితంగా తరలించాలని అనుకుంటే నేరుగా కృష్ణాలో కలుపొద్దు. అలా చేస్తే హక్కులపై సమస్య వస్తుంది. కృష్ణానదిపై ఆక్వాడేట్ నిర్మించి దీనిపై నుంచి బొల్లాపల్లికి తరలించి పెన్నా నదిలో కలుపొచ్చు’ అని చెప్పారు.
గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు ఏపీకి గేమ్ చేంజర్ అనేది పొరపాటు అభిప్రాయమని శోభనాద్రీశ్వర్రావు కుండబద్దలు కొట్టారు. ‘ఈ విషయంలో సీఎం చంద్రబాబు రాంగ్ డైరెక్షన్లో వెళుతున్నారు. దీనిపై ఎవరు చెప్పినా ఆయన వినడం లేదు. తామంతా ఎంతో చర్చించి దీనిపై వివరించాం. కానీ ఆయన వినడం లేదు. చివరికి చంద్రబాబు క్షేమం కోరే వ్యక్తులో ఏబీ వెంకటేశ్వరరావు మొదటగా ఉంటారు. ఆయన చెప్పినా చంద్రబాబు వినడం లేదు’ అని విమర్శించారు.