హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ ఆథారిటీ(హెచ్ఎండీఏ) పరిధిలోని ఖాళీ జాగాల విలువను లెక్కించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏడు జిల్లాల వరకు విస్తరించిన హెచ్ఎండీఏ ల్యాండ్ బ్యాంక్ నివేదికను రూపొందించారు. నివేదిక ఆధారంగా భూముల విలువ, కబ్జా అయిన భూమి విలువ, బహిరంగ మార్కెట్ విలువతో కూడిన ప్రత్యేక నివేదికపై కసరత్తు చేస్తున్నారు. కొంతకాలంగా హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లేఅవుట్లలో మిగిలిన ప్లాట్ల వేలానికి ప్రత్యేక జాబితాను ప్రభుత్వానికి సమర్పించారు. ఇప్పుడు హెచ్ఎండీఏకు ఉన్న ఖాళీ జాగాలపై మరో నివేదిక సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తున్నది. వచ్చే ఏడాదిలో ఆన్లైన్ వేలం కోసమే ఈ నివేదికల తయారీ అని సమాచారం.
ఔటర్ రింగ్ రోడ్డు దాటి, ప్రతిపాదిత రీజనల్ రింగు రోడ్డు వరకు విస్తరించిన హెచ్ఎండీఏకు భారీగా భూములున్నాయి. ముఖ్యంగా ఔటర్ రింగు రోడ్డు సమీపంలో భూములకు పదేండ్లలో భారీ స్థాయిలో డిమాండ్ పెరిగింది. గతేడాది బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన వేలానికి వచ్చిన అనూహ్య స్పందనతో దేశవ్యాప్తంగా హైదరాబాద్ భూములపై చర్చ జరిగింది. భాగ్యనగరం రియల్ ఎస్టేట్ అమాంతం పెరిగింది. ఇప్పుడు కూడా హెచ్ఎండీఏ అధికారులు భూముల వేలానికి కసరత్తు చేస్తున్నారు. భూమి ఎన్ని ఎకరాలు, ఔటర్ నుంచి ఎంత దూరం, దగ్గర్లోని రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు, భూముల విలువ వంటి వివరాలతో నివేదికలు రూపొందిస్తున్నారు.
హెచ్ఎండీఏ అధికారులు కోకాపేట్, మోకీలా, బహదూర్‌పల్లి, బండ్లగూడ, తొర్రూర్, బంజారాహిల్స్, బుద్వేల్‌లో భూములను మరోసారి వేలం వేసేందుకు కసరత్తు చేస్తున్నారు. కానీ హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇటీవల స్తబ్ధుగా మారింది. అమ్మకాలు, కొనుగోళ్లు గణనీయంగా పడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో భూముల వేలం మంచిదా కాదా అని హెచ్ఎండీఏ అధికారులు అయోమయంలో ఉన్నారు. వీటితో పాటు ఖాళీ జాగాల విలువను కూడా లెక్కించడం ద్వారా ప్రభుత్వానికి సమకూరే ఆదాయంపై మరింత స్పష్టత వస్తుందని చెబుతున్నారు.