హైదరాబాద్ : తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్ రచించిన తెలంగాణ ఉద్యమాల చరిత్ర మూడో ఎడిషన్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు విడుదల చేశారు. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. 150 సంవత్సరాల ఉద్యమ చరిత్రను వీ ప్రకాశ్ ఎంతో శ్రమించి, లోతుగా అధ్యయనం చేసి, విస్తృత అవగాహనతో ఒక చక్కటి పుస్తకాన్ని రచించారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం త్వరలో విడుదల చేసే గ్రూప్ -1, గ్రూప్-2, గ్రూప్-3, పోలీసు ఉద్యోగాలతో పాటు పలు పోటీ పరీక్షలకు ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ పుస్తకాన్ని ప్రతి రిక్రూట్మెంట్ సంస్థ ప్రామాణిక రిఫరెన్స్ గ్రంథం కింద పరిగణిస్తుందని చెప్పారు. ప్రకాశ్ తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. మలిదశ ఉద్యమంలో ప్రతి అంశాన్ని వ్యక్తిగతంగా పరిశీలించడం, పరిణామాలను విశ్లేషించి పోటీ పరీక్షలకు అనుగుణంగా ఈ పుస్తకాన్ని రచించారని హరీశ్‌రావు ప్రశంసించారు.
అనంతరం వీ ప్రకాశ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమాల చరిత్ర మూడవ రివైజ్డ్ ఎడిషన్ చాలా విశిష్టమైందని పేర్కొన్నారు. ఏడున్నరేండ్ల అభివృద్ధిని తెలంగాణ ప్రగతి రాగాల వీణ అనే శీర్షికతో ప్రత్యేక అనుబంధాన్ని జోడించామని తెలిపారు. గతంలో నిర్వహించిన పలు పోటీ పరీక్షల్లో ఈ పుస్తకం నుంచి 150 ప్రశ్నలకు గానూ 123 ప్రశ్నలు యధాతథంగా వచ్చాయని గుర్తు చేశారు. ప్రధాన పుస్తకంతో పాటు 250 పేజీలతో సుమారు 3 వేల ప్రశ్నలతో కూడిన క్వశ్చన్ బ్యాంక్‌ను కూడా ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు.