హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : ‘కేంద్రంలోని బీజేపీతో టీడీపీ పొత్తు ఉన్నదని ఏపీ మంత్రి లోకేశ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నరు.. ఇది ప్రజాస్వామ్య దేశం.. అలా మాట్లాడితే కుదురబోదు’ అని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. పోలవరం- బనకచర్ల లింక్ ప్రాజెక్టును తెలంగాణ అన్నివిధాలా వ్యతిరేకిస్తున్నదని, ఆ ప్రాజెక్టుపై లోకేశ్ చేసిన వ్యాఖ్యలు సరికాదని తెలిపారు. లోకేశ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు చెప్పారు. సచివాలయంలో మీడియా ప్రతినిధులతో మంత్రి శుక్రవారం చిట్‌చాట్ నిర్వహిస్తూ లోకేశ్ వ్యాఖ్యలపై స్పందించారు.
ఏపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టును పర్యావరణ మంత్రిత్వశాఖ, జీఆర్ఎంబీతోపాటు పలు కేంద్ర సంస్థలే వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. తానే స్వయంగా కేంద్రానికి లేఖలు రాశానని వివరించారు. బనకచర్లను ఆపేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలా చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. ఎంతటి పోరాటానికైనా తాము సిద్ధమని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన కమిటీతో నేడు (ఆదివారం) సమావేశమవుతానని వెల్లడించారు. 4న నిర్వహించే క్యాబినెట్లో పెట్టాల్సిన అంశాలపై చర్చిస్తామని
వివరించారు.