హైదరాబాద్, ఫిబ్రవరి15 (నమస్తే తెలంగాణ): ప్రాజెక్టుల పనుల్లో అలసత్వం వహించవద్దని, క్షేత్రస్థాయిలో పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సాగునీటిపారుదల శాఖ ఉన్నతాధికారులను ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఎస్ఎల్బీసీ, డిండి, పాలమూరు- రంగారెడ్డి తదితర ప్రాజెక్టుల పురోగతి.. రాజస్థాన్‌లో 18, 19 తేదీల్లో నిర్వహించనున్న అఖిల భారత నీటిపారుదల మంత్రుల సదస్సుకు సంబంధించిన అంశాలను జలసౌధలో శనివారం ఆయన సమీక్షించారు.
ప్రాజెక్టు వివరాలు, క్షేత్రస్థాయి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. పనుల్లో ఆలస్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. జాతీయ సదస్సుకు సంబంధించి నీటిపారుదల రంగంలో రాష్ట్రం తీసుకొచ్చిన సంసరణలు, డిజిటల్ మానిటరింగ్‌తో పాటు నీటి నిర్వహణపై అనుసరిస్తున్న ఆధునిక విధానాలు, మైక్రో ఇరిగేషన్, పూడికతీత తదితర అంశాలపై సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు.
పెండింగ్ ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయడం ద్వారా అదనంగా 30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ముందుకుపోతున్నామని వివరించారు. సమావేశంలో నీటిపారుదల ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ అనిల్‌కుమార్, సీఈలు కే శ్రీనివాస్, అజయ్‌కుమార్, రమేష్‌బాబు, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.