హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): ‘పోలవరం-బనకచర్ల’ పనులను టర్మినల్ ఫేజ్, ప్రాజెక్టు పేరు మార్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్నదని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో ఉత్తమ్‌కుమార్ మాట్లాడుతూ.. సమ్మక్క-సారక్క ప్రాజెక్టుకు క్లియరెన్స్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు. అల్మట్టి ప్రాజెక్టు ఎత్తును 519 మీటర్ల కంటే ఎక్కువ పెంచొద్దని సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని, అయినప్పటికీ కర్ణాటక ప్రభుత్వం జీవో తెచ్చి ఎత్తు పెంచడానికి భూసేకరణ కోసం ప్రొసీడింగ్స్ ఇచ్చిందని పేర్కొన్నారు.
కర్ణాటక తీసుకొచ్చిన జీవోను కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు వెల్లడించారు. ప్రాణహిత-చేవెళ్ల, నారాయణపేట-కొడంగల్, సీతారామ, పాలమూరు-రంగారెడ్డి, చిన్న కాళేశ్వరం లిఫ్ట్, మోదికుంట వాగు ప్రాజెక్టుల కోసం కేంద్రాన్ని నిధులు అడిగినట్టు తెలిపారు. కేఆర్ఎంబీ టెలీమెట్రీ స్టేషన్ పనులు త్వరగా పూర్తిచేయాలని కోరినట్టు చెప్పారు. తెలంగాణ నీటి పారుదల రంగానికి ఎక్కువ నిధులు ఖర్చు చేసే రాష్ట్రమని, ప్రాజెక్టులకు పీఎంకేఎస్ఐ కింద 2026-2031 వరకు కేంద్రం ఆర్థిక సహకారం అందిస్తామని హామీ ఇచ్చారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు.