హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): వ్యవసాయంలో యూరియాకు ప్రత్యామ్నాయంగా జీవ వ్యర్థాల ద్వారా తయారయ్యే ఎరువులు వినియోగాన్ని పెంచాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ వర్సిటీ ఉపకులపతి అల్దాస్ జానయ్య సూచించారు. దేశంలోని వియత్నాం రాయబార కార్యాలయం డిప్యూటీ రాయబారి ట్రాన్ థాన్టంగ్, బయోవే-వియత్నాం సీఈఓ లీతి కాంటిన్ల ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో కలిసి ఆయన శుక్రవారం విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఉద్యాన పంటలు, మాంసం వ్యర్థాలు, గుర్రపు డెక తదితర వ్యర్థాల నుంచి ఎరువులను ఆరుగంటల్లో తయారు చేసే పరిజ్ఞానాన్ని, యంత్ర పరికరాలను బయోవే వియత్నాం సంస్థ నుంచి వ్యవసాయ వర్సిటీకి ఉచితంగా అందించే అవగాహన ఒప్పందంపై రెండు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ఒప్పందం దేశంలోనే తొలిసారి అని ట్రాన్ థాన్టంగ్, లీతి కాంటిన్ తెలిపారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 12 దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని, ఇది 13వ ఒప్పందమని వివరించారు. ఎన్నో ఏండ్ల పరిశోధనల తర్వాత ఈ పరిజ్ఞానాన్ని ఈ సంస్థ కనుగొన్నదని అల్దాస్ జానయ్య తెలిపారు. బయోవే వియత్నాం రెండేండ్లపాటు ఉచితంగా యంత్రాలు ఏర్పాటు చేస్తుందని, ఆ తర్వాత ఈ జీవ ఎరువులను అన్ని కోణాల్లో పరిశీలించి రైతాంగానికి అందిస్తామని జానయ్య వెల్లడించారు.