హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తమ సేవలను మెరుగుపర్చేందుకు టీజీఎస్ఆర్టీసీ మరో అడుగు ముందుకేసింది. తమ ఉత్పాదకత పెంపు, సిబ్బంది పనితీరు, ఆరోగ్యస్థితి పర్యవేక్షణ, ఖర్చుల తగ్గింపు, రద్దీకి అనుగుణంగా సర్వీసుల ఏర్పాటుతోపాటు సేవలను మరింత ప్రజానుకూలంగా తీర్చిదిద్దడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని ఉపయోగించుకుంటున్నది. ఈ మేరకు ఏఐ ప్రాజెక్టు అమలుకు ‘హన్స ఈక్విటీ పార్టనర్స్ ఎల్ఎల్పీ’ అనే సంస్థ ఆర్టీసీకి తోడ్పాటును అందిస్తున్నది. సంస్థలో ఏఐ వినియోగం కోసం ఏర్పాటైన ప్రత్యేక టీంకు హన్స ఈక్విటీ పార్ట్నర్స్ శిక్షణ ఇస్తున్నది. ఏఐ ప్రాజెక్టులో భాగంగా మొదటిగా 40వేల మంది సిబ్బంది ఆరోగ్యస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మొదట పైలట్ ప్రాజెక్ట్‌గా ఆరు డిపోల్లో అమలు చేయగా మంచి ఫలితాలు వచ్చాయి. ప్రస్తుతం అన్ని డిపోల్లోనూ ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా సచివాలయంలో ఇటీవల రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఉన్నతాధికారులు ఏఐ వినియోగాన్ని వివరించారు. అనంతరం హన్స ఈక్విటీ పార్ట్నర్స్ ఎల్ఎల్పీకి చెందిన త్రినాథబాబు, సునీల్ రేగుళ్లను పొన్నం ప్రభాకర్ ప్రత్యేకంగా అభినందించి, సన్మానించారు.