హైదరాబాద్: యూఎస్ ఎఫ్-1 విద్యార్థి వీసా దరఖాస్తుదారుడు ఒకరు హైదరాబాద్ కాన్సులేట్‌లో గత నెల 30న జరిగిన వీసా ఇంటర్వ్యూలో తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు. తాను విద్యాభ్యాసం, తానెంచుకున్న యూనివర్సిటీకి సంబంధించిన ప్రామాణిక ప్రశ్నలకు సరిగ్గా సమాధానాలు చెప్పినా, ఆ తర్వాత తాను ఊహించని విధంగా కాన్సులర్ అధికారి సాంకేతిక అంశాలపై ప్రశ్నలు అడిగారని తెలిపారు.
వాటికి తాను ఆత్మ విశ్వాసంతో సమాధానాలు చెప్పినా.. సెక్షన్ 214(బి) ప్రకారం తన వీసా దరఖాస్తును తిరస్కరించారని వాపోయారు. ‘అధికారి అడిగిన సాంకేతిక ప్రశ్నల స్థాయిని చూసి నేను ఆశ్చర్యపోయాను. అర్రే, లింక్డ్ లిస్ట్, లీనియర్ రిగ్రెషన్ మధ్య గల భేదాల గురించి ఆయన ప్రశ్నలు అడిగారు. నేను నిజాయితీగా ప్రతి ప్రశ్నకు శాంతంగా సమాధానమిచ్చాను. అయినా నేను ఎక్కడ తప్పటడుగు వేశానో తెలియడం లేదు.’ అని అతడు రెడ్డిట్‌లో పేర్కొన్నాడు.