హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ అథారిటీతో (డీసీఏ) అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) చేతులు కలిపింది. భారత్‌లో ఎఫ్‌డీఏ ప్రతినిధి డాక్టర్ సారా మెక్కల్లం నేతృత్వంలోని బృందం బుధవారం హైదరాబాద్ వెంగళ్రావునగర్లోని డీసీఏను సందర్శించినట్టు సంస్థ డీజీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. దేశంలోని ఫార్మా ఉత్పత్తుల్లో 35 శాతం తెలంగాణ నుంచే వస్తుండటం, యూఎస్ ఎఫ్‌డీఏ అనుమతులు పొందిన 214 ఫార్మా కంపెనీలు తెలంగాణలో ఉన్న నేపథ్యంలో సంయుక్తంగా ‘రెగ్యులేటరీ ఫోరం’ ఏర్పాటు చేయాలని వారు ప్రతిపాదించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా డీసీఏ కార్యకలాపాలను వారికి వివరించామని తెలిపారు. అనంతరం సారా మెక్కల్లం ఎఫ్‌డీఏ అనుమతులు పొందిన కంపెనీలు ఎలాంటి నిబంధనలు పాటించాలో వివరించారని పేర్కొన్నారు. కంపెనీల పర్యవేక్షణకు, భవిష్యత్తులో బంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు సంయుక్తంగా ఒక కమిటీని వేయాలని ప్రతిపాదించారని తెలిపారు.