హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): యువత తమ కలలు సాకారం చేసుకొనేందుకు తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన టీ-హబ్‌కు అంతర్జాతీయ ప్రశంస లభించింది. టీ-హబ్ సందర్శన లేకుం డా హైదరాబాద్ పర్యటన పూర్తవదని యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ కితాబిచ్చారు. దేశంలోనే డైనమిక్ ఫీచర్స్ కలిగిన నగరంగా హైదరాబాద్ నిలుస్తున్నదని, తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చేలా రూపుదిద్దుకొన్నదని పేర్కొన్నారు. యూఎస్ సెనేటర్ సెన్టాడ్ యంగ్ తొలిసారి హైదరాబాద్ పర్యటనకు రాగా, ఆయనతో కలిసి జెన్సిఫర్ లార్సన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో కొత్తగా నిర్మించిన యూఎస్ కాన్సులేట్ భవనాన్ని సందర్శించారు.
అనంతరం రాయదుర్గం ఐటీ కారిడార్‌లోని టీ హబ్‌ను సందర్శించి, అక్కడి ప్రతినిధులతో సమావేశమయ్యారు. యూఎస్ ప్రతినిధుల బృందం అనుభవాలను జెన్నిఫర్ లార్సన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. హైదరాబాద్ ఒక రంగానికే పరిమితం కాలేదని, ఐటీ, లైఫ్ సైన్సెస్, ఢిఫెన్స్, ఏరోస్పేస్ రంగాల్లోనూ ఎంతో అభివృద్ధి చెందుతున్నదని తెలిపారు. దేశంలోనే స్టార్టప్ ఎకో సిస్టం అభివృద్ధిలో టీ -హబ్ ఎంతో కీలకంగా మారిందని ప్రశంసించారు.