హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో యూరియా కొరత మంత్రులు, దళారుల సృష్టేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపించారు. వారంతా కలిసి సృష్టించిన కృతిమ కొరతగా ఇది అని విమర్శించారు. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో మాత్రమే యూరియా కొరత ఎందుకు ఉందని ప్రశ్నించారు. రైతులంతా మంత్రులను నిలదీయాలని పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికలు-ఐటీ, సోషల్‌మీడియా వర్క్‌షాప్‌లో రాంచందర్‌రావు మాట్లాడారు.
యూరియా కృత్రిమ కొరత సృష్టించి, ఆ నెపాన్ని కేంద్రం మీద వేసి, నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. 19 నెలల నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. రిజర్వేషన్ల పేరుమీద కాలయాపలన చేశారని ధ్వజమెత్తారు. ఓడిపోతామన్న భయంతోనే కాంగ్రెస్ పాలకులు ఎన్నికలను నిర్వహించడంలేదని మండిపడ్డారు. అంతర్గత విషయాలను బయటపెడితే తమ పార్టీ నేతలను సస్పెండ్ చేస్తామని తేల్చిచెప్పారు. కొందరు వ్యక్తిగతంగా ఎదిగేందుకు పార్టీకి నష్టంచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నేతల మధ్య గ్యాప్ సృష్టిస్తున్నారన్నారు.