హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): యూరియా కొరత రాష్ట్రవ్యాప్తంగా రచ్చ రచ్చ అవుతున్నది. రాత్రి పగలు తేడా లేకుండా రైతులు రోడ్లపై పడిగాపులు కాస్తున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో దగ్గరుండి పర్యవేక్షించాల్సిన మార్క్‌ఫెడ్ ఉన్నతాధికారులు తమకెందుకులే అనే ధోరణిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. యూరియా కోసం రైతులు రాత్రి నుంచే ఎరువుల దుకాణాల వద్ద క్యూలు కడుతుంటే, అధికారులు మాత్రం సమయపాలన పాటించకుండా నింపాదిగా ఆఫీసుకు వస్తుండటంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఉన్నతాధికారులు మధ్యాహ్నం తర్వాతే ఆఫీసుకు వస్తుండటం విమర్శలకు తావిస్తున్నది. ఇది ఒక్కరోజు పరిస్థితి కాదని, ప్రతిరోజూ ఇదే తతంగమనే చర్చ మార్క్‌ఫెడ్‌లో జరుగుతున్నది. బయట సమావేశాలు లేకపోయినప్పటికీ ఆఫీసుకు ఉదయం రావడంలేదని తెలిసింది. అధికారులు ఆఫీసు సమయం ఉదయం 10.30 గంటలకు వచ్చిన సందర్భాలు చేతివేళ్లపై లెక్కించవచ్చనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మంత్రి ఆదేశాలూ బేఖాతర్
సమయ పాలన పాటించాలని మంత్రి జారీచేసిన ఆదేశాలను సైతం మార్క్‌ఫెడ్ ఉన్నతాధికారులు బేఖాతర్ చేస్తున్నారు. ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మార్క్‌ఫెడ్ కార్యాలయాన్ని ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో ఎండీ, జీఎం ఇద్దరూ కార్యాలయంలో లేకపోవడం గమనార్హం. వీరితోపాటు ఇతర అధికారులు సైతం కార్యాలయంలో లేరు. అయితే, ఆ రోజు ఎండీ శ్రీనివాస్‌రెడ్డి ధాన్యం కొనుగోళ్లపై సమీక్షకు హాజరైనట్టు తెలిసింది. మిగిలిన అధికారుల తీరుపై మంత్రి తుమ్మల తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సమయానికి రాని ఉద్యోగులకు మెమోలు జారీచేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగానే 13 మంది ఉద్యోగులకు ఎండీ శ్రీనివాస్‌రెడ్డి మెమోలు జారీచేసినట్టు తెలిసింది. ఆ తర్వాత అంతా షరామామూలే. ఉన్నతాధికారులతోపాటు ఇతర ఉద్యోగులు కూడా సమయానికి రావడంలేదని సమాచారం. దీంతో మంత్రి ఆదేశాలంటే వీరికి లెక్కలేదా? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయిల్‌ఫెడ్ అధికారులు మాత్రం మంత్రి ఆదేశాలను పాటించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయిల్‌ఫెడ్‌లోనూ మంత్రి తనిఖీ చేశారు. ఆ తర్వాత ఆయిల్‌ఫెడ్ ఎండీ.. అధికారులు, ఉద్యోగులతో సమావేశం నిర్వహించి ప్రతి ఒక్కరూ కచ్చితంగా సమయానికి రావాలని, కడుపునొప్పి, ట్రాఫిక్‌జామ్, కారు లేదు, డ్రైవర్ లేడు వంటి కుంటిసాకులు చెప్పొద్దని ఆదేశాలు జారీచేసినట్టు తెలిసింది. కానీ, మార్క్‌ఫెడ్‌లో మాత్రం ఇలాంటి పరిస్థితి లేకపోవడం గమనార్హం.
క్లిష్ల పరిస్థితుల్లోనూ పట్టింపు లేదా?
యూరియా సరఫరాలో మార్క్ఫెడ్ది కీలక పాత్ర. యూరియా గోదాములు, ట్రాన్స్పోర్ట్ మొత్తం మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నది. దీంతో రాష్ట్రంలో ఎక్కడ యూరియా అవసరమైనా సరే మార్క్‌ఫెడ్ ద్వారానే సరఫరా కావాలి. యూరియా సరఫరాలో ఇంతటి కీలకమైన బాధ్యతలు ఉండగా.. అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉదయమే కార్యాలయానికి వచ్చి.. ఎక్కడ ఎంత స్టాక్ ఉన్నది? ఎక్కడికి ఎంత స్టాక్ వెళ్లాలి? ఎక్కడినుంచి ఎక్కడికి తరలించాలి? వంటి అంశాలపై నిరంతరం సమీక్ష నిర్వహిస్తే కొంత మేరకైనా ఇబ్బందులు తొలగించే అవకాశం ఉంటుంది. అలాకాకుండా అధికారులు ఆఫీసుకే మధ్యాహ్నం తర్వాత వస్తే.. ఇక సమీక్ష ఎప్పుడు చేసేది, ఇబ్బందులు ఎప్పుడు పరిష్కరించేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో యూరియా కొరతకు మార్క్‌ఫెడ్ అధికారుల నిర్లక్ష్య వైఖరి కూడా కొంత కారణమనే విమర్శలున్నాయి.