రాష్ట్రవ్యాప్తంగా యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తున్నది. గ్రామాల్లో రైతులంతా పనులు మాని గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తున్నది. కుటుంబమంతా క్యూలో నిల్చున్నా యూరియా దొరుకుతుందా లేదా అనేది తెలియని పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల చెప్పులు, మరికొన్ని చోట్ల పాస్‌పుస్తకాలు, ఇతర వస్తువులు లైన్లో పెట్టి, తమవంతు రాగానే యూరియా తీసుకెళ్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో సగం మందికి కూడా యూరియా అందకపోతుండటంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమను నిండా ముంచాయని రైతులు మండిపడుతున్నారు. ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ తమ గోసను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గోసపై గొంతెత్తి..
మెదక్ జిల్లా చిలిపిచెడ్ రైతు వేదిక వద్ద ఉదయం ఏవో రాజశేఖర్ గౌడ్, సొసైటీ సీఈవో పోచయ్య,పోలీసుల సమక్షంలో రైతులకు టోకెన్లు అందజేశారు. చాలామంది రైతులకు అందకపోవడంతో నర్సాపూర్-జోగిపేట రహదారిపై ధర్నా చేశారు. ఎస్సై నర్సింహులు వచ్చి రైతులందరికీ యూరియా అందజేస్తామని చెప్పడంతో రాస్తారోకో విరమించారు.
మావంతు ఎప్పుడొస్తదో..
కోటపల్లి: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి పీఏసీఎస్‌కు 444 బస్తాలు రాగా, 600 మందికిపైగా రైతులు తరలివచ్చి క్యూ కట్టారు. గంటల తరబడి లైన్లో నిల్చున్నా సగం మందికి పైగా యూరియా అందించకపోవడంతో నిరాశతో ఇంటి ముఖంపట్టారు. సరిపడా యూరియా తెప్పించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.
నిరీక్షించి.. నీరసించి.. నీడ చెంత చేరి..
అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం, నెల్లిపాక సొసైటీ కార్యాలయాల వద్ద పెద్ద సంఖ్యలో రైతులు యూరియా కోసం వచ్చారు. ఎండ మండుతుండటంతో లైన్లో పాస్‌బుక్కులు పెట్టి ఇలా చెట్ల కింద కూర్చున్నారు.
నకిలీ ఎరువుల కలకలం
నాగర్‌కర్నూల్, ఆగస్టు 25 : నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఓ ఫర్టిలైజర్ దుకాణ యజమాని నాసిరకం ఎరువులను అంటగట్టి తమను మోసం చేశారని తెలకపల్లి మండ లం జమిస్తాపూర్ రైతులు సోమవారం కలెక్టరేట్‌కు చేరుకొని ఆందోళనకు దిగారు. డీలర్‌ను నిలదీస్తే పట్టించుకోకుండా మాట దాటవేశాడని మండిపడ్డారు. రైతులు తీసుకెళ్లిన నకిలీ ఎరువు బస్తాను, నాణ్యత కలిగిన మరో బస్తాను కలెక్టరేట్ తీసుకెళ్లి రెండింటికీ తేడాను గుర్తించడంతో సదరు ఫర్టిలైజర్ యజమాని కాళ్ల బేరానికి వచ్చాడు. నష్టపరిహారం కింద రూ.2 లక్షల కట్టిస్తానంటూ వేడుకున్నాడు. డీలర్‌పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
యూరియా కొరత ఎక్కడా లేదు: ఎమ్మెల్యే కడియం
రఘునాథపల్లి, ఆగస్టు 25 : నియోజకవర్గంలో ఎక్కడా యూరియా సమస్య లేదని, కొంతమంది పని గట్టుకొని ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని స్టేషన్‌ఘన్‌ఫూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కుర్చపల్లిలో సోమవారం పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాన చేశారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ.. రైతులు ఇబ్బందులు పడ్డట్టు తన దృష్టికి రాలేదని పేర్కొన్నారు. తన దృష్టికి వస్తే యూరియా కొరత రాకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
అన్నదాత ఆగ్రహజ్వాల
కరీంనగర్: యూరియా ఇవ్వాలంటూ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి సింగిల్ విండో కార్యాలయం ఎదుట రాస్తారోకో చేస్తున్న రైతులు. యూరియా లోడు రాగానే అందరికీ అందిస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు.
రోడ్డెక్కిన రైతు
యూరియా ఏదంటూ సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి రైతువేదిక ఎదుట రహదారిపై రైతులు గంటపాటు ధర్నా, రాస్తారోకో చేశారు. సీఎం, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నిద్ర కూడా కరువాయె..
తొర్రూరు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పీఏసీఎస్‌కు రైతులు సోమవారం తెల్లవారుజామున నుంచే బారులు తీరారు. సోమారపుకుంట తండాకు చెందిన రైతు బానోత్ జానీ తెల్లవారుజామున 3 గంటలకే వచ్చి అక్కడే నిద్రించాడు.
ఎన్ని వీడియోలు తీసినా.. జాగారం చేస్తున్నది రైతులే!
యూరియా బస్తాల కోసం రాత్రనకా పగలనకా రైతులు పడిగాపులు పడుతున్నారు. మెదక్ జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని సహకార కార్యాలయం వద్ద ఆదివారం రాత్రి దృశ్యమిది. ఉదయం నుంచీ లైన్లో నిలబడినా యూరియా దక్కలేదని, సోమవారమైనా దొరక్కపోదన్న ఆశతో ఇక్కడనే పడుకున్నామని రైతులు చెప్పారు. యూరియా కోసం జాగారం చేసినవాళ్లలో మహిళలు కూడా ఉన్నారు.