మహబూబాబాద్ రూరల్/కమలాపూర్/రఘునాథపాలెం, డిసెంబర్ 26 : వానకాలంలో యూరి యా అందక రైతులు అవస్థలుపడ్డారు. ఇప్పుడు యాసంగిలోనూ అవే పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. మహబూబాబాద్ రూరల్ మండలంలోని రైతులు యూరియా బస్తాల కోసం పడిగాపులుకాస్తున్నారు. వేంనూరు, ఉత్తరతండా, ఈదులపూసపల్లి, శనిగపురం రైతులు 20 రోజులుగా యూరియా కోసం ఆగ్రోస్ సెంటర్, పీఏసీఎస్ కేంద్రాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామునే వందల సంఖ్యలో రైతులు పీఏసీఎస్ కేంద్రానికి వచ్చి లైన్లో నిలబడ్డారు. సెంటర్ అధికారులు మాత్రం యూరియా స్టాక్ రాలేదని సెంటర్ ముందు గోడపై అంటించారు. ఇది సోషల్ మీడియోలో వైరల్‌గా మారడంతో రైతులు ఆగ్రహంతో పట్టణంలోని ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. 2 గంటలపాటు రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. దీంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. టౌన్ పోలీసులు చేరుకొని వ్యవసాయ అధికారులను అక్కడికి పిలిపించి ఏఈవోలతో గ్రామాల వారీగా రైతులకు చిట్టీలు రాయించి యూరియా అందిస్తామని చెప్పడంతో ధర్నా విరమించారు.
కాగా, గురువారం అర్ధరాత్రి నుంచే భారీ సంఖ్యలో రైతులు పీఏసీఎస్ కేంద్రానికి చేరుకుని బారులుతీరారు. కాళ్లు నొప్పులు పెట్టడంతో చెప్పులు, దుప్పట్లు, రాళ్లను లైన్లో పెట్టారు. అర్ధరాత్రి ఎముకలు కొరికే చలిలో గజగజ వణుకుతూ యూరియా కోసం పడిగాపులుకాచారు. చలికి తట్టుకోలేక కొంతమంది రైతులు చలి మంటలు వేసుకున్నారు. చలిలో రైతుల కష్టాన్ని చూసి మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్‌లో స్పందించారు. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు పడుతున్న కష్టాలను చూసి సీఎం రేవంత్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సావు భాష తప్ప.. సాగు గురించి సోయి లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే, రైతుల బతుకులు ఇలా క్యూలో తెల్లారాల్సిందే. రేవంత్ విధ్వంసకర పాలనకు బలైపోతున్నది రైతే. రైతులకు సమయానికి యూరియా కూడా అందించలేని నువ్వు ముఖ్యమంత్రివా?’ అని ప్రశ్నించారు.
పనిచేయని యాప్.. పంపిణీలో ఇక్కట్లు
హనుమకొండ జిల్లా కమలాపూర్ పీఏసీఎస్‌కు రెండు వేలకుపైగా యూరియా బస్తాలు వారం క్రితం వచ్చాయి. ప్రభుత్వం యాప్ ద్వారా పంపిణీ చేయాలని ఆదేశించడంతో వారంపాటు పంపిణీ చేయకుండా నిలిపివేశారు. విషయం తెలుసుకున్న మండలంలోని పంగిడిపల్లి, వంగపల్లి, గూడూరు, మాధన్నపేట, లక్ష్మీపూర్, కానిపర్తి, దేశరాజ్‌పల్లి తదితర గ్రామాల రైతులు మూడురోజులుగా పీఏసీఎస్‌కు వచ్చి క్యూకడుతున్నారు. యాప్ పనిచేయకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆధార్ నంబర్ ఆన్లైన్లో నమోదు చేసుకుంటూ ఒక్కో రైతుకు 3 బస్తాల చొప్పున రెండు రోజులు పంపిణీచేశారు. మూడోరోజు 620 బస్తాలు పంపిణీకి సిద్ధం చేశారు. శుక్రవారం తెల్లవారుజామునే పీఏసీఎస్ వద్దకు రైతులు వచ్చి క్యూకట్టారు. తోపులాట, వాగ్వాదం జరగడంతో పోలీసుల సాయంతో ఆధార్ నంబర్ నమోదుచేసి యూరియా అందజేశారు. చివరిరోజు ఆలస్యంగా వచ్చిన రైతులకు దొరక్కపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.
మంత్రి ఇలాకాలోనూ యూరియా తిప్పలు
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇలాకాలోనూ యూరియాకు తిప్పలు తప్పడంలేదు. రఘునాథపాలెం మండలం మంచుకొండ పీఏసీఎస్ వద్ద శుక్రవారం తెల్లవారుజాము నుంచే రైతులు యూరియా కోసం బారులుదీరారు. వ్యవసాయాధికారులు తొలుత రైతులకు కూపన్లు ఇచ్చి క్యూలో పంపించారు. రైతులకు అనుగుణంగా యూరియా నిల్వలు లేకపోవడంతో రైతులంతా కేంద్రం బయటే పడిగాపులు కాస్తూ ఎదురుచూశారు. సొసైటీకి 445 బస్తాల యూరియా రాగా.. ఒక్కో రైతుకు రెండు బస్తాలు మాత్రమే ఇచ్చి సర్దుబాటు చేశారు. పూర్తి స్టాకు లేకపోవడంతో కొందరు రైతులు నిరాశతో వెనుదిరిగారు. వెంకటాయపాలెం పరిధిలో కూపన్లు జారీ చేయగా యూరియా పంపిణీ చేశారు. సరిపడా స్టాక్ లేకపోవడంతో అనేకమంది రైతులు ఇంటిబాట పట్టారు.
ఒక్క బస్తా యూరియా ఇవ్వలే..
యాసంగి ప్రారంభమైనప్పటి నుంచి ఇంతవరకు ఒక్క బస్తా యూరియా కూడా ఇవ్వలేదు. నాకు ఉన్న మూడెకరాల భూమిలో రెండు ఎకరాల్లో మిర్చి, ఎకరం మక్క వేసిన. తోటకు దుక్కిచేసి యూరియా వేద్దామని రోజూ తిరుగుతున్నా. యూరియా దొరకడం లేదు. రేపు మాపు అంటూ కాలం వెల్లదీస్తున్నారు. ప్రతిరోజూ తోటపని వదిలేసి పీఏసీఎస్ చుట్టూ తిరుగుతున్నా. అయినా యూరియా దొరకలేదు.
-భూక్యా నంద్యా, రైతు, ఉత్తరతండా
తెల్లారంగనే వచ్చిన
యూరియా బస్తాలు ఇస్తున్నారని తెలిసి తెల్లారంగనే వచ్చిన. సొసైటీ అధికారులు వచ్చేసరికి పది గంటలైంది. అప్పటి నుంచి ఇక్కడే ఉన్న. తోపులాట అయితుందని అందరి దగ్గర పట్టాదారు పాస్‌పుస్తకాలు తీసుకున్నరు. బువ్వ తినకుండా వచ్చి ఉపాసం ఉంటున్నం. ఒక్కో రైతుకు మూడు బస్తాలే ఇచ్చిండ్రు. పొద్దటి నుంచి సాయంత్రం దాకా ఇక్కడే ఉంటే.. మూడు బస్తాలు మాత్రమే వచ్చినయి. గతంలో ఏ ప్రభుత్వం రైతులను ఇట్ల గోసపుచ్చుకోలే. యూరియా బస్తాల కోసం కాపలా కాసే దుస్థితి వచ్చింది.
– రాజేశ్వర్‌రావు, రైతు, పంగిడిపల్లి
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆగం చేసింది
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను ఆగం చేసింది. లాభం జరిగే ఒక్క పని చేయలే. వానకాలంలో యూరియా కోసం అరిగోస పడ్డం. మళ్లీ యాసంగిలోనూ అదే గోస. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ముందస్తు ప్రణాళిక చేయలేదు. గతంలో యూరియా కోసం ఇంతకష్టం పడలే. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు యూరియా సమస్య లేకుండా చూడాలి.
– బానోత్ శంకర్, రైతు, రోటిబండతండా
పనులు వదులుకొని వచ్చిన
నాకు ఐదెకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్నది. యూరియా బస్తాల కోసం పని వదులుకొని పొద్దున్నే పీఏసీఎస్‌కు వచ్చిన. పొలంలో పనిచేసుకోకుండా యూరియా బస్తాల కోసమే రోజుల తరబడి తిరుగుతున్న. ప్రైవేటు వ్యాపారుల వద్దకు పోతే ఒక్క యూరియా బస్తా రూ.330 అంటున్నరు. బస్తా ఇస్తే మరొక్కటి అంటగడుతున్నరు. ప్రభుత్వం యాప్ ద్వారా పంపిణీ చేస్తామని చెప్పినా అది పనిచేయట్లే.
-వీరన్న, రైతు, పంగిడిపల్లి