హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్ సంక్లిష్ట ప్రశ్నలతో అభ్యర్థులను సవాల్ చేసింది. ఆదివారం ఉదయం జనరల్ స్టడీస్ ఎగ్జామ్ జరుగగా, మధ్యాహ్నం జరిగిన సీ శాట్ పేపర్ సైతం కఠినంగానే ఉందని అభ్యర్థులు వెల్లడించారు. జీఎస్ పేపర్లో మధ్యయుగ చరిత్ర, పురాతన చరిత్ర నుంచి వచ్చిన ప్రశ్నలు అత్యంత కఠినంగా ఉన్నాయి. కళలు, సంస్కృతి, మాడ్రన్ హిస్టరీ, అంతర్జాతీయ సంబంధాలు, జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ సబ్జెక్టుల నుంచి అడిన ప్రశ్నలు మధ్యస్థంగా వచ్చాయి. ఇక ఎకనామిక్స్ మధ్యస్థం నుంచి కఠినంగా ఉండగా, ఒక్క పాలిటీ అండ్ గవర్నెన్స్ నుంచి అడిగిన ప్రశ్నలు సులభంగా వచ్చాయని శిక్షణా సంస్థల నిర్వాహకులు తెలిపారు. సీ శాట్ పేపర్లోని మూడు సెక్షన్స్లోనూ ప్రశ్నలు కఠినంగానే ఇచ్చారు.
గతంలో ఇంగ్లిష్ రాకపోయినా.. అర్థమెటిక్, లాజిక్రీజనింగ్పై ఆధారపడి అభ్యర్థులు గట్టెక్కేవారు. కానీ, ఈ ఏడాది ప్రశ్నలు కఠినంగానే వచ్చాయి. జీఎస్‌లో 45-50 మధ్య ప్రశ్నల నిడివి పెద్దవిగా, క్లిష్టంగా ఉండటంతో సమయం ఎక్కువ తీసుకున్నట్టుగా పరీక్ష రాసిన అభ్యర్థి వినయ్‌కుమార్ తెలిపారు. ఈ పరీక్షల ఫలితాలు అతిత్వరగా విడుదల కానుండగా, సెప్టెంబర్‌లో మెయిన్స్ ఎగ్జామ్స్ జరుగుతాయి. పోస్టుల సంఖ్య పెరిగినా, ఈ ఏడాది కటాఫ్ గతంలోలాగే ఉండే అవకాశముందని సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ మల్లవరపు బాలలత అంచనావేశారు. కాగా, హైదరాబాద్, హనుమకొండ కేంద్రాల్లో పరీక్షలు సజావుగా సాగాయి. హైదరాబాద్‌లో మొత్తం 45611 మంది అభ్యర్థులకు ఉదయం పరీక్షకు 27458 మంది (60.20%), మధ్యాహ్నం పరీక్షకు 27132 మంది (59.49%) హాజరైనట్టు హైదరాబాద్ డీఆర్వో సూర్యలత తెలిపారు.
01