హనుమకొండ/రఘునాథపల్లి/గీసుగొండ/జనగామ చౌరస్తా/చిక్కడపల్లి, ఏప్రిల్ 16: సివిల్స్ తుదిఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లావాసులకు ర్యాంకుల పంట పడింది. అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మంచి ర్యాంకులు సాధించారు. జనగామకు చెందిన బిల్డర్ మెరుగు సుధాకర్-సుజాత దంపతుల కుమారుడు కౌశిక్ ఆలిండియా 82వ ర్యాంకు సాధించాడు. ఓయూలో బీటెక్ పూర్తి చేసి ఢిల్లీలోని ఐఐఎఫ్‌టీలో ఎంబీఏ చదివిన అనంతరం.. సివిల్స్ కోచింగ్ తీసుకొని తొలి ప్రయత్నంలోనే 82వ ర్యాంకు సాధించాడు. 15 ఏండ్లుగా కౌశిక్ కుటుంబం హైదరాబాద్‌లోని హబ్సిగూడలో నివాసముంటున్నారు. మొదటి ప్రయత్నంలోనే 82వ ర్యాంక్ సాధించడం చాలా సంతోషంగా ఉన్నదని మెరుగు కౌశిక్ తెలిపారు. సివిల్స్ సాధించాలన్న తన పదేండ్ల కల సాకారమైందని పేర్కొన్నారు.
తల్లిదండ్రుల ప్రోత్సాహం, ప్రముఖ విద్యావేత్త అశోక్నగర్నగర్లో సీఎస్బీ అకాడమీ అధినేత్రి బాలలత మెంటర్‌గా అందించిన సూచనలు ర్యాంకు రావడానికి ఎంతో దోహదపడ్డాయని కౌశిక్ చెప్పారు. హనుమకొండకు చెందిన రావుల జయసింహారెడ్డి 104వ ర్యాంకు సాధించాడు. ఈయన గతేడాది 217 ర్యాంకు రాగా, ఐపీఎస్ సాధించాడు. జయసింహారెడ్డి తండ్రి రావుల ఉమారెడ్డి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో సహ పరిశోధన సంచాలకుడిగా విధులు నిర్వహిస్తుండగా, తల్లి లక్ష్మి గృహిణి. జనగామ జిల్లా రఘునాథపల్లికి చెందిన కొయ్యడ ప్రణయ్‌కుమార్ రెండో ప్రయత్నంలో 554వ ర్యాంకు సాధించారు.
మండలకేంద్రానికి చెందిన కొయ్యడ ప్రభాకర్-లక్ష్మి దంపతులు కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు. వారి మూడో కుమారుడైన ప్రణయ్‌కుమార్ గజ్వేల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిటెక్నిక్, కూకట్పల్లి జేఎన్టీయూలో బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ చదివాడు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే స్టడీ సరిల్లో చేరి కష్టపడి చదివాడు. గతేడాది 885వ ర్యాంకు సాధించాడు. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం అనంతారం గ్రామానికి చెందిన సయింపు ప్రభాకర్-జయలక్ష్మీ కుమారుడు కిరణ్ గతంలో సెంట్రల్ ఆర్మీ పోలీస్ ఫోర్స్ ఆసిస్టెంట్ కమాండెంట్‌గా పనిచేశారు.
అనంతరం ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్(ఐఐఎస్) అసిస్టెంట్ డైరెక్టర్, ఇండియన్ పోస్టల్ సర్వీస్ అధికారిగా అవకాశం వచ్చింది. చివరి ప్రయత్నంగా 568వ ర్యాంకు సాధించి తాను అనుకున్న లక్ష్యానికి చేరువయ్యాడు. కాగా కిరణ్, 5వతరగతిలో జవహర్ నవోదయ ఎంట్రెన్స్ పరీక్ష రాసి వరంగల్ మమునూరులోని నవోదయ పాఠశాలలో చేరి పదవ తరగతి పూర్తి చేశాడు. అక్కడి నుంచి ఇంటర్ గుంటూరు భాష్యం కళాశాలలో పూర్తి చేసి, 2017లో ఢిల్లీ ఐఐటీలో బీటెక్ పూర్తి చేశాడు. వరంగల్ శివనగర్‌కు చెందిన అనిల్‌కుమార్‌కు 764 ర్యాంకు వచ్చింది.