హైదరాబాద్ : నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్‌కు వ్యతిరేకంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ( Kisan reddy ) రాష్ట్ర కార్యాలయంలో ఉన్న సమయంలోనే నానా హంగామా చేశారు. బీజేపీ మండల అధ్యక్షుల ప్రకటనపై పదవుల్లో అన్యాయం చేశారంటూ ఎంపీ అరవింద్ ( MP Aravind ) కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ నెల 24న బీజేపీ జిల్లా శాఖ అధ్యక్షుడు బస్వపురం లక్ష్మీనరసయ్య జిల్లాలోని బోధన్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లోని మండలాల అధ్యక్షుల పేర్లను ప్రకటించారు. బాల్గొండ నియోజకవర్గంలోని ముప్కాల్, మెండోరా, భీంగల్ టౌన్, ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్‌టౌన్, మాక్లూరు, డొంకేశ్వర్, ఆలూరు మండలాల అధ్యక్షుల పేర్లను వెల్లడించారు.
అదేవిధంగా బోధన్ నియోజకవర్గంలోని నవీపేట, రెంజల్, ఎడపల్లి, బోధన్‌రూరల్, సాలూరు మండలాలకు బీజేపీ అధ్యక్షుడి పేర్లను ప్రకటించారు. మండల అధ్యక్షుల ఎన్నిక ఏకపక్షంగా జరిగిందని, నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ కార్యాలయానికి వచ్చి నిరసన తెలిపారు. ఒక దశలో వారిస్తున్న బీజేపీ కార్యదర్శి ప్రకాశ్‌రెడ్డిపై దాడి చేసినట్లు సమాచారం.
నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాలకు బీజేపీ మండల అధ్యక్షుడి పేర్ల ఖరారు, అధ్యక్షుల మార్పులో తన ప్రమేయం లేదని ఎంపీ అరవింద్ పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడి నిర్ణయం మేరకే మండల అధ్యక్షుల నియామకాలు జరిగాయని, సంస్థాగత నిర్ణయాలను జిల్లా అధ్యక్షుడే తీసుకుంటారని ఆయన వెల్లడించారు.