హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): ఫేక్ వార్తలంటే బీజేపీకి తెగ ఇష్టం. ఈ ఫేక్గిరీలో ఎంతకైనా తెగించే తత్వం వారి సొంతం. నాయకులను సోషల్ మీడియాలో ఫేక్ పోస్టింగులతో ఆకాశానికెత్తేసి పబ్బం గడుపుకోవాలని చూసే పార్టీ మరి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వరంగల్ పర్యటన సందర్భంగా ఆ పార్టీ చేసిన ట్వీట్ల కుట్ర ఈ సంగతిని మరోసారి బయటపెట్టింది. ఎట్లాగూ తెలంగాణలో మనల్ని దేకెటోడు లేడు. మనం తీసుకువచ్చే నేత అంటే ఎవరికీ తెలియదు.
కాబట్టి ఆయన అడుగుపెట్టగానే అరుపులు.. చెయ్యి ఊపితే మెరుపులు.. మాట్లాడితే నిప్పులు అన్నట్టు కలరింగ్ ఇయ్యాలె, ఆన్లైన్లో మన పేరు మారుమోగిపోవాలె. ఇలా సినిమా ైస్టెల్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకొన్నారు. నడ్డా తెలంగాణలో అడుగుపెట్టింది మొదలు సోషల్ మీడియాలో ఆయన పేరే వినిపించేలా భారీ కుట్రకు తెరలేపింది బీజేపీ. క్షేత్రస్థాయిలో ఎలాగూ ప్రజాబలం లేదు కాబట్టి ఆన్లైన్లో కిరాయి మనుషులను నమ్ముకున్నది. డబ్బులు ఇచ్చి మరీ పొగిడించుకుంటూ ట్వీట్లు వేయించాలని పన్నాగం పన్నింది. దీనిని స్వయంగా మళ్లీ బీజేపీయే బయట పెట్టుకోవడం అసలు ట్విస్ట్.
కిరాయి వ్యక్తులు.. స్క్రిప్టెడ్ ట్వీట్లు
బీజేపీ తనకు అనుకూలంగా ట్వీట్లు వేసేందుకు కొందరు కిరాయి వ్యక్తులను నియమించుకున్నది. జేపీ నడ్డా శంషాబాద్ విమానాశ్రయంలో దిగింది మొదలు వరుసగా ట్వీట్లు వేసేలా ఒప్పందం చేసుకున్నది. ఎప్పుడు ఏ ట్వీట్ వేయాలో సూచిస్తూ దాదాపు 115 ట్వీట్లతో ఓ టూల్ కిట్ తయారు చేయించింది. వీటన్నింటినీ ‘జేపీ నడ్డా ఇన్ ఓరుగల్లు’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో వదలాలని ఆదేశించింది. ‘జేపీ నడ్డాకు స్వాగతం’ అనే ట్వీట్ దగ్గరి నుంచి.. ఆయన ఏమేం మాట్లాడతారో, ఏది ట్వీట్ చేయాలో ముందుగానే నిర్దేశించింది. దీనిని బట్టే జేపీ నడ్డా ప్రసంగం మొత్తం ఎవరో రాసిచ్చిందని అర్థమవుతున్నది.
ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. కిరాయి మనుషుల అత్యుత్సాహం బీజేపీ కొంప ముంచింది. ఒక ట్వీట్ చేయాల్సింది పోయి.. దాదాపు 15 పేజీల నిండా రాసుకున్న అన్ని ట్వీట్ల ఫైల్‌ను అప్లోడ్ చేశారు. ఇది వనపర్తి జిల్లా బీజేపీ శాఖకు చెందిన ‘బీజేపీ4వనపర్తి’ అనే ట్విట్టర్ ఖాతాలో అప్లోడ్ అవడం విశేషం. దీంతో బీజేపీ నాటకం మొత్తం బయటపడింది. ఆ తర్వాత నాలుక కరుచుకున్న బీజేపీ నేతలు ఆ ట్వీట్లను తొలిగించారు. అయితే అప్పటికే నెటిజన్లకు బీజేపీ కుట్ర గురించి పూర్తిగా తెలిసిపోవడంతో మండిపడుతున్నారు. ఇప్పుడు బీజేపీకి ఉన్న వాపు కూడా కిరాయికి తెచ్చుకున్నదే అన్నమాట.. అంటూ జోకులేస్తున్నారు.