హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో విజయపతాక ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు దిశానిర్దేశం చేశారు. నందినగర్ నివాసంలో ఆదివారం సిట్ విచారణ ముగిసిన అనంతరం తనను కలిసిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలతో ఆయన కొద్దిసేపు మాట్లాడారు. రాష్ట్రంలో జరిగే 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, అందరినీ సమన్వయ పరచుకోవాలని సూచించారు. అధికార పార్టీ చేసే కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఉద్బోధించారు. పోలింగ్ రోజు కాంగ్రె స్ బల ప్రదర్శన చేసే అవకాశం ఉం టుందని, గులాబీ సేనలను అప్రమత్తంగా ఉంచాలని, అత్యధిక మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.
క్రాంతి బాగున్నావా? ఆందోల్ ఎలా ఉంది? ; క్రాంతికిరణ్కి కేసీఆర్ పరామర్శ
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): సిట్ విచారణ అనంతరం కేసీఆర్‌ను తనను ఆప్యాయంగా పలుకరించారని, ఆయనను పరామర్శించేందుకు వెళ్తే.. ఆయనే తనను పరామర్శించి నియోజకవర్గం అభివృద్ధిపై మాట్లాడారని ఆందోళ్ మాజీ ఎమెల్యే చంటి క్రాంతికిరణ్ చెప్పారు. కేసీఆర్‌తో ఉద్యమ అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. తనని పరామర్శించి.. మున్సిపల్ ఎన్నికల నేపథ్యం లో అనుసరించాల్సిన వ్యూహాలను, అభివృద్ధికి జరగాల్సిన పోరాటాలపై దిశానిర్దేశం చేశారని చెప్పారు. తెలంగాణకు దశ, దిశ చూపిన నేత ను.. అక్రమ కేసుల్లో విచారణల పేరుతో వేధించడం సరికాదని పేర్కొన్నారు.