ఆదిలాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ)/సిద్దిపేట: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం సాయంత్రం కురిసిన ఈదురుగాలులతో కూలిన వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. రైతులకు తీరని నష్టం మిగిల్చింది. ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షంతో జొన్న, మక్క, నువ్వు, పొగాకు, కంది పంటలకు నష్టం వాటిల్లింది. వందలాది ఎకరాల్లో జొన్న పంటల నేలకొరిగింది. 900 ఎకరాల్లో రైతులు పంటలను నష్టపోయినట్టు ప్రాథమిక అంచనా వేశామని జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య తెలిపారు. ఇంద్రవెల్లిలో ఓ జిన్నింగ్ మిల్లులో రైతులు ఆరబెట్టిన మక్కపంట వర్షానికి తడిసిముద్దయింది. తలమడగు మండలంలో దెబ్బతిన్న పంటలను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరిశీలించారు. ప్రభుత్వం రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో వడగండ్ల వాన పడింది. సిద్దిపేటతోపాటు నియోజకవర్గంలోని చిన్నకోడూరు, సిద్దిపేట అర్బన్, రూరల్ మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. సిద్దిపేటతోపాటు పలు గ్రామాల్లో చోట్లు నేలకూలాయి. చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్, పెద్దకోడూరులో మామిడి, మక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం జరిగింది. స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. చిన్నశంకరంపేట, రామాయంపేట, చేగుంట, నిజాంపేట, నార్సింగ్, తూప్రాన్ మండలాల్లో వడగండ్ల వానకు పంటలు నేలకొరిగాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, నారాయణఖేడ్, న్యాల్కల్, ఝరాసంగం, మొగుడంపల్లి, మనూరు, కంగ్టి, హత్నూర మండలాల్లో వడగండ్ల వాన కురిసింది. సంగారెడ్డి జిల్లాలో 714 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.